సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా నిలుస్తున్నది. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నది. దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ అవసరాలకు బొగ్గు ఉత్పత్తి చేస్తూ జాతీయస్థాయిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. తెలంగాణ ఏర్పాటయ్యాక సంస్థలో భారీగా సంస్కరణలు జరిగాయి. సీఎం కేసీఆర్ ఆదేశంతో సింగరేణి సంస్థ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేపట్టని విధంగా సింగరేణిలో పథకాలు అమలయ్యాయి. 12,553 మందికి కారుణ్య నియామకాలు, 38 వేల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించింది. సొంతింటికి రూ.10 లక్షల వరకూ వడ్డీ లేని రుణం అందించింది. సంస్థ ఏటా ఆర్జించే నికర లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నది. దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అడ్వాన్స్ అందజేస్తున్నది. ఇలా ఎన్నో పథకాలతో కార్మికులకు అండగా నిలుస్తున్నది. యాజమాన్యం సాధించిన విజయాలు, ఉద్యోగుల హక్కులు, సీఎం కేసీఆర్ కార్మికులపై కురిపించిన వరాలపై ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక కథనం.
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 24: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. సుమారు 60 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు.. వారిపై ఆధారపడుతున్న కుటుంబాలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి.. రాష్ట్రంలో సింగరేణి ముఖ్యమైన ఉపాధి కేంద్రం. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత జవసత్వాలు నింపుకొన్న సంస్థ బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది. దేశంలో ఎనిమిది రాష్ర్టాల్లోని పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తున్నది. లక్షలాది మంది ఇళ్లలో వెలుగులు నింపేందుకు దోహదపడుతున్నది. ఈ నేపథ్యంలో యాజమాన్యం సాధించిన విజయాలు, ఉద్యోగులు సాధించిన హక్కులు, సీఎం కేసీఆర్ కార్మికులపై కురిపించిన వరాలపై ప్రత్యేక కథనం.
స్వరాష్ట్రం వచ్చాక సంస్కరణలు..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర వహించారు. రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సమ్మె రోజులు కార్మికులకు స్పెషల్ లీవ్స్ అయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి ఉద్యోగులకు ఇంక్రిమెంట్ అమలైంది. 2014 ఆగస్టు నుంచి 59,545 మంది ఉద్యోగులకు సంస్థ నెలకు రూ.5.04 కోట్ల ఇంక్రిమెంట్ చెల్లిస్తున్నది. టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన ‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)’ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడింది. జాతీయ కార్మిక సంఘాలు పట్టించుకోక కోల్పోయిన హక్కులను తిరిగి టీబీజీకేఎస్ సాధించింది. కార్మికుల మన్ననలు పొందింది. మ్యాచింగ్ గ్రాంట్ పెంపు, విధి నిర్వహణలో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి అందే పరిహారం పెంపు.. ఇలా ఎన్నో ప్రయోజనాల కోసం టీబీజీకేఎస్ పోరాడింది.
లాభాల్లో కార్మికులకు వాటా…
సంస్థ ఏటా ఆర్జించే నికర లాభాల్లో 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి కార్మికులు 23శాతం వాటా పొందుతున్నారు. సంస్థ ఏటా వాటాను పెంచుతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కార్మికులకు 29 శాతం వాటా ఇచ్చింది. ఈ ఏడాది అక్టోబర్లో కార్మికుల ఖాతాల్లో రూ.79.06 కోట్ల బోనస్ జమ చేసింది. దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అడ్వాన్స్ ఇస్తున్నది. ఎన్సీడబ్ల్యూఏ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పెంచింది.
ఉద్యోగాల భర్తీ ఇలా..
2014 -21 వరకు సంస్థ 58 నోటిఫికేషన్లు విడుదల చేసింది. 5,500 పోస్టులను భర్తీ చేసింది. వలంటరీ రిటైర్మెంట్ స్కీం స్థానంలో సీఎం కేసీఆర్ తిరిగి డిపెండెంట్లకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశం ఇచ్చారు. 2015 నుంచి ఈ ఏడాది నవంబర్ 30 వరకు 12,553 మంది కారుణ్య నియామక పత్రాలు అందుకున్నారు. యాజమాన్యం ఉద్యోగుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించింది. దీనికోసం రూ.60 కోట్లు కేటాయించింది. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీని వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. వేడుకల నిర్వహణకు ఏటా ప్రతి ఏరియాకు రూ.50 వేలు మంజూరు చేస్తున్నది. ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు 30 నవంబర్ 2017న బోర్డాఫ్ డైరెక్టర్స్ అనుమతులిచ్చారు. ఉద్యో గులు, అధికారులు సొంతింటిని నిర్మించుకునేందుకు సంస్థ రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణం అంది స్తున్నది. ఇప్పటివరకు 5,244 మంది లోన్ తీసుకు న్నారు. సింగరేణి యాజమాన్యం నాణ్యమైన బొగ్గును రవాణా చేస్తూ ఇప్పటివరకు బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు, పెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ అవార్డు వంటి ఎన్నో పుర స్కారాలను అందుకున్నది. సీఎండీ శ్రీధర్ ఆధ్వర్యంలో సంస్థ బొగ్గు ఉత్పత్తిలో దూసుకెళ్తున్నది.
స్వరాష్ట్రం వచ్చాకే కార్మికులకు గుర్తింపు..
ఉమ్మడి రాష్ట్రంలో మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. అప్పటి పాలకులు సింగరేణిని విస్మరించారు. స్వరాష్ట్రం వచ్చాకే సింగరేణి కార్మికులకు సరైన గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులపై ఆదరాభిమానాలు చూపించి ఎన్నో వాగ్ధానాలను నెరవేర్చారు. మా సమస్యలను తెలుసుకుని మరీ అడగకుండానే పరిష్కరించారు. సీఎం చొరవకు మేమంతా రుణపడి ఉన్నాం.
-ముప్పాని సోమిరెడ్డి, టీబీజీకేఎస్ కార్పొరేట్ ఉపాధ్యక్షుడు, కొత్తగూడెం