ఆయన అరాచకాలకు లెక్కలేదు.. ఆగడాలకు అడ్డూఅదుపూ లేదు. సెటిల్మెంట్లలో ఆరితేరాడు. భూ పంచాయితీల్లో తలదూర్చి కబ్జాలు చేస్తాడు. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించాలని వెళ్లిన మహిళలపై కన్నేస్తాడు. స్వప్రయోజనం లేకుండా ఏ సెటిల్మెంట్లూ చేయడు.. ఇదీ కొత్తగూడెం పట్టణానికి చెందిన వనమా రాఘవ బాగోతం పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడు వనమా రాఘవను పోలీసులు పట్టుకున్నారు. ఆయన కోసం మూడు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం దమ్మపేట- చింతలపూడి సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పోలీసులు 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే మలిపెద్ది వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో మణుగూరు ఏఎస్పీ శబరీశ్ ఎదుట విచారణకు హాజరుకావాలని వనమా ఇంటివద్ద పోలీసులు నోటీసు అంటించారు. ఆయన అరాచకాలకు లెక్కలేదు.. ఆగడాలకు అడ్డూఅదుపూ లేదు. సెటిల్మెంట్లలో ఆరితేరాడు. భూ పంచాయితీల్లో తలదూర్చి కబ్జాలు చేస్తాడు. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించాలని వెళ్లిన మహిళలపై కన్నేస్తాడు. స్వప్రయోజనం లేకుండా ఏ సెటిల్మెంట్లూ చేయడు.. ఇదీ కొత్తగూడెం పట్టణానికి చెందిన వనమా రాఘవ బాగోతం..
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 7 (నమస్తే తెలంగాణ): వనమా రాఘవపై వచ్చిన ఆరోపణలను టీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నది. పాల్వంచ రామకృష్ణ కుటంబంతో కలిసి సజీవ దహనమైన ఘటనపై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుని శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఆ ఆదేశాలు అమలవుతాయని ప్రకటించింది. తన చావుకు వనమా రాఘవ కారణమంటూ ఈ నెల 2వ తేదీన పాత పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గ్యాస్ లీక్ చేసుకుని, నిప్పంటించుకుని సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజు 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పోలీసుల అదుపులో రాఘవ
మూడురోజులుగా రాఘవ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు దమ్మపేట- చింతలపూడి సరిహద్దులో పట్టుకున్నారు. రాఘవను పట్టుకునేందుకు ఎస్పీ సునీల్‌దత్ ఆదేశాల మేరకు ఎనిమిది బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో నమోదైన కేసులనూ విచారిస్తామని, అవసరమైతే రౌడీషీట్ సైతం తెరుస్తామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజు ప్రకటించారు.
రాఘవ ఇంటికి నోటీసులు..
పాల్వంచకు చెందిన మలిపెద్ది వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గతేడాది ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం వనమా రాఘవతో పాటు పలువురు వ్యక్తులు అని సూసైడ్ నోట్ రాశాడు. ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మణుగూరు ఏఎస్పీ శబరీశ్ విచారణ చేపట్టారు. వనమా రాఘవపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాఘవ బెయిల్ తీసుకున్నాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈనెల 2వ తేదీన పాల్వంచలో రామకృష్ణ కుటుంబం సజీవ దహమైన నేపథ్యంలో బెయిల్ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ వనమా రాఘవ పరారయ్యాడు. దీంతో అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శబరీశ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం 12:30 గంటలలోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని పోలీసులు రాఘవ ఇంటికి నోటీసు ఇచ్చారు.
తాను చెప్పిందే శాసనం..
వనమా రాఘవ వైఖరిపై అనేక ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ అధికారైనా తన మాట వినాలనే మనస్తత్వంతో రాఘవ ఉండేవాడని స్థానిక రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సెటిల్మెంట్ల సమయంలో ఎవరైనా మాట వినకపోతే బెదిరింపులకు పాల్పడేవాడు. చివరికి పాల్వంచకు చెందిన రామకృష్ణ సజీవ దహన ఘటనతో అతడి ఒక్కో ఆగడం వెలుగులోకి వస్తున్నది. ఆస్తి తాగాదాలు, సివిల్ కేసుల్లో తలదూర్చేవాడు. సెటిల్మెంట్లు చేసేవాడు.
ఆగడాలు ఇవీ..
1986లో పాల్వంచకు చెందిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎదురు తిరిగిన ఆమెకు శిరోముండనం చేయించాడు. పాల్వంచలోని స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో1993లో ఉద్యోగుల ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో తాను బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయాలని చెర్ల చిట్టయ్య అనే వ్యక్తితో పాటు పలువురిని కిడ్నాప్ చేసిన కేసులోనూ రాఘవ నిందితుడు. చెర్ల చిట్టయ్య మృతదేహం గోదావరిలో లభించడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో రాజీ మార్గాన బయటకు వచ్చినట్లు తెలుస్తున్నది. 1992లో ఓ పోలీస్ అధికారి భార్యను ట్రాప్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో మనస్తాపం చెందిన సదరు అధికారి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. 2009లో రాఘవ ఇంటి నిర్మాణం ప్రారంభమైంది. ఈ పనులకు అక్రమంగా విద్యుత్ వినియోగించడాన్ని పావురాల శ్రీను అనే వ్యక్తి గుర్తించాడు. తర్వాత ఏమైందో తెలియదుగానీ శ్రీను హత్యకు గురయ్యాడు. ఈ కేసులోనూ రాఘవ నిందితుడు. 2020లో జ్యోతి అనే మహిళ ఆస్తి తగాదాలో మాట వినడం లేదని తన అనుచరులతో దాడి చేయించాడు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో రాఘవపై ఫిర్యాదు చేసింది. పోలీసులు 307 సెక్షన్ కింద రాఘవపై కేసు నమోదు చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
టేకులపల్లి, జనవరి 7: పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం సజీవ దహనానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో వివిధ పార్టీల నేతలు వేర్వేరుగా సమావేశాల్లో మాట్లాడారు. ఆయా సమావేశాల్లో అఖిలపక్ష నాయకులు ధర్మపురి వీరబ్రహ్మాచారి, కల్తీ వెంకటేశ్వర్లు, జర్పుల సుందర్, రామచందర్, ఎట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
పలువురి అరెస్టు..
పాల్వంచ, జనవరి 7: బంద్‌లో భాగంగా అఖిల పక్ష నాయకులు పాల్వంచ పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. వనమా రాఘవను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు పట్టణంలోని పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్‌ను మూసివేయించేందుకు యత్నించగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించని కొందరు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
రామకృష్ణ సెల్ఫీ వీడియో వైరల్..
ఆస్తి తగాదా విషయంలో పంచాయితీ చేసిన రాఘవ అభ్యంతరంగా మాట్లాడాడనే రామకృష్ణ సెల్ఫీ వీడియో గురువారం సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అయింది. ఆస్తి సెటిల్మెంట్కు తన సతీమణిని సైతం వనమా రాఘవ పంపమని అడిగినట్లు రామకృష్ణ వీడియో సారాంశం. రాఘవ అసభ్యకర వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నానని రామకృష్ణ వీడియోలో పేర్కొన్నాడు. రాఘవను తక్షణం అరెస్టు చేయాలని కొత్తగూడెం, పాల్వంచలో వివిధ వర్గాల వారు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాఘవను అదుపులోకి తీసుకోవాలని సోషల్ మీడియాలోనూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.