భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్2 (నమస్తే తెలంగాణ) /ఖమ్మం సిటీ, జనవరి 2: ఇక పిల్లలకూ టీకా అందనున్నది. తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు కరోనా టీకా వేసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్దల మాదిరిగానే పిల్లలకూ రెండు డోసుల టీకా ఇవ్వనున్నారు. మొదటి డోసు వేసిన 28రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తారు. టీకా వేసుకునే వారిలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరం చదివేవారే ఎక్కువ.
ఒమిక్రాన్ నుంచి రక్షణ కోసం..
కొవిడ్ నుంచి రక్షణ పొందేందుకు ఇప్పుడు పిల్లల వంతు వచ్చింది. ఇప్పటివరకు 18 ఏండ్ల పైబడిన వారికి మాత్రమే కొవిడ్ టీకా అందింది. ఈ కేటగిరీ వారికి అన్ని జిల్లాలో మొదటి డోసు వంద శాతం, రెండో డోసు వారికి 70 నుంచి 75 శాతం దాటాయి. ఒమిక్రాన్ వంటి వేరియంట్స్ విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లలకూ టీకా వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. టీకా కార్యక్రమం సోమవారం మొదలు కానున్నది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 70-75 వేల మంది, భద్రాద్రి జిల్లాలో 60 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు గౌతమ్, అనుదీప్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉభయ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ప్రధాన వైద్యశాల, ఏరియా వైద్యశాల, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మాత్రమే పిల్లలకు టీకా అందనున్నది. పిల్లలందరికీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేస్తున్నామని రెండు జిల్లాల డీఎంహెచ్వోలు మాలతి, శిరీష తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు చేయించుకోని వారికీ స్పాట్ రిజిస్ట్రేషన్ టీకా ఇస్తామన్నారు.
వచ్చే వారం నుంచి బూస్టర్ డోస్..
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు టీకా వేసేందుకూ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ బూస్టర్ డోస్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. బూస్టర్ డోసు ముందుగా 60 ఏండ్లు పైబడిన వారికి, ఫ్రంట్‌లైన్ వారియర్స్, పోలీసులకు అందనున్నది. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రామవరంలో కలెక్టర్ అనుదీప్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
కొవాగ్జిన్ టీకా వేసేందుకు వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు టీకా వేస్తాం. వ్యాక్సినేషన్‌కు 40 కేంద్రాల్లో టీకా వేస్తున్నాం. పిల్లలు ఆధార్ కార్డు, ఐడీ కార్డులను తప్పని సరిగా తీసుకురావాలి.