ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనలు కఠినతరం చేయడంతోపాటు 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టింది. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఖమ్మం జిల్లావ్యాప్తంగా 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో సిబ్బంది 1,178 మందికి ఫస్ట్ డోస్ ఇచ్చారు. భద్రాద్రి జిల్లాలో 40 కేంద్రాల్లో 1,929 మందికి టీకాలు వేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 3(నమస్తే తెలంగాణ)/ ఖమ్మం సిటీ: ఉమ్మడి జిల్లాలో సోమవారం టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 15-18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలిరోజు వైద్యసిబ్బంది 1,178 మందికి కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని 30 నిమిషాల పాటు పర్యవేక్షణలో ఉంచారు. టీకాలు తీసుకున్న వారికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు తలెత్తలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వేయించేలా శ్రద్ధ తీసుకోవాలని డీఎంహెచ్‌వో మాలతి సూచిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రామవరం యూపీహెచ్‌సీలో కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, అర్బన్ హెల్త్ సెంటర్లో డీఎంహెచ్‌వో డాక్టర్ శిరీష వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. వైద్యారోగ్యశాఖ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాల్లో టీకా ప్రారంభించారు. వైద్యారోగ్య సిబ్బంది మొదటి రోజు 1,929 మందికి టీకాలు వేశారు. వైద్యారోగ్యశాఖ సర్వే ప్రకారం జిల్లాలో 15- 18 ఏండ్ల లోపు పిల్లలు 55 వేల మంది ఉన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సిబ్బంది ఆధార్ కార్ట్, ఐడీ కార్డు వివరాలను తీసుకుని టీకా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 18 ఏండ్లు నిండిన వారికి వందశాతం మొదటి డోస్ పూర్తి కాగా సెకండ్ డోస్ చివరి దశకు వచ్చింది.