సంగారెడ్డి అర్బన్, జనవరి 3 : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా 15 నుంచి 18 ఏండ్ల లోపు టీనేజర్లకు సోమవారం వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్, మార్క్స్‌నగర్‌లో టీనేజర్లకు కొవాగ్జిన్ టీకా ఇచ్చారు. 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇవ్వనున్నారు. టీనేజర్లు ఉత్సాహంగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకొని టీకా తీసుకున్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా ఇన్‌చార్జ్జి వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో 1.60 లక్షల మంది టీనేజర్లు ఉన్నారని, ప్రస్తుతం 50 వేల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. టీనేజర్లలందరూ వ్యాక్సిన్ తీసుకొని వైరస్ నుంచి రక్షణ పొందాలన్నారు.
మెదక్ జిల్లాలో 45 వేల మంది టీనేజర్లు
మెదక్, జనవరి 3 : మెదక్ జిల్లాలో 15-18 ఏండ్ల్లలోపు టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మొదటి రోజు సోమవారం 217 మంది టీనేజర్లు టీకా తీసుకున్నారు. జిల్లాలో 15-18 ఏండ్ల్లలోపు వయస్సు వారు 45 వేల మంది ఉన్నారని అధికారులు తెలిపారు. జిల్లాలో టీనేజర్లకు కొవాగ్జిన్ టీకా ఇస్తున్నట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్రావు తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రం మెదక్‌లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ను ఆయన ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లాలో 67,492 మంది టీనేజర్లు
సిద్దిపేట, జనవరి 3 : 15 నుంచి 18 ఏండ్లలోపు యువతకు టీకా వేసే కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ అధికారులు సిద్దిపేట జిల్లాలో ప్రారంభించారు. జిల్లాలో 67,492 టీనేజర్లకు గాను తొలి రోజు 862 మందికి టీకా వేశారు.