ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 15 నుంచి 18 సంవత్సరాల వారికి కొవిడ్ టీకా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానతోపాటు, అన్ని సీహెచ్‌సీలు, పీహెచ్సీలలో టీకా ఇవ్వనున్నారు. జిల్లా వ్యాప్తంగా టీనేజర్లు 40వేల వరకు ఉంటారని అంచనా వేసిన జిల్లా వైద్యారోగ్య శాఖ 40వేల కొవాగ్జిన్ డోసులను సిద్ధం చేసి ఉంచింది. అలాగే ఈ నెల 10 నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోసు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది.
యాదాద్రి భువనగిరి, జనవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మూడోవేవ్ ముప్పు నేపథ్యంలో గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకాలను వేయించి రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 15-18 ఏండ్ల లోపు వయస్సున్న వారికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఆ వయస్సు వారందరికీ టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. మొదటి, రెండో డోసు సందర్భాల్లో చేపట్టిన ఏర్పాట్లు, జాగ్రత్తలనే ఈసారి కూడా పాటించేలా చూస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానతో పాటు జిల్లాలోని 21 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీల పరిధిలో టీకాలు వేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్ అవసరం లేనందున.. గుర్తింపు కార్డులతో వస్తే టీకాలు వేస్తామని వైద్యులు చెబుతున్నారు. టీకా వేశాక కొద్దిసేపు వైద్యబృందం పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత పంపిస్తామని అంటున్నారు.
జిల్లాలో 40వేల మంది టీనేజర్స్
15 నుంచి 18 ఏండ్లు నిండిన వారు జిల్లాలో 40వేల మంది వరకు ఉండొచ్చని వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వీరందరికీ కొవాగ్జిన్ టీకా ఇవ్వనున్నందున కొరత లేకుండా 40వేల డోసులను అందుబాటులో ఉంచారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతోపాటు ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వనున్నారు. అవసరమైతే ఆయా కళాశాలలకే వెళ్లి టీకాలు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియనంతా ఈనెల 10 లోపుగా పూర్తిచేసేలా కార్యాచరణను రూపొందించుకున్నారు.
ఏర్పాట్లు పూర్తి…
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ టీకా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏండ్ల వయస్సు గల వారికి టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. సుమారు 40వేల మంది వరకు టీనేజర్స్ ఉంటారని మా అంచనా. కళాశాలల్లోనూ ప్రత్యేక క్యాంపులు నిర్వహించి టీకా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. నేరుగా వచ్చి సంబంధిత ఐడీ కార్డును చూపించి టీకా వేయించుకోవచ్చు.
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోస్
రెండేండ్లుగా కరోనా గడగడలాడిస్తున్న నేపథ్యంలో గతేడాది జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. తొలుత వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు వేశారు. ఆ తర్వాత 45 సంవత్సరాలు పైబడ్డ వారికి, అనంతరం 18 ఏండ్లు నిండిన వారందరికీ టీకాలు వేశారు. ఇప్పటివరకు జిల్లాలో 18 సంవత్సరాలు పైబడ్డ వారిలో తొలిడోసు నూరు శాతం పూర్తికాగా, రెండో డోసు టీకాలను 80 శాతం మంది వేయించుకున్నారు. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది టీకాలు వేస్తున్నారు. వ్యాక్సినేషన్లో జిల్లా ముందంజలో ఉండగా.. ఇదే స్ఫూర్తితో టీనేజర్స్‌కు వేసే దిశగా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని ఫ్రంట్‌లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్లు, 60 ఏండ్లు నిండిన వారందరికీ టీకా ఇచ్చేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈనెల 10 నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.