తెలంగాణ రైతాంగంపై కత్తికట్టి, ధాన్యం కొనుగోళ్లపై కక్ష సాధిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై అన్నదాతలు తిరగబడ్డారు. తమ బతుకును అంధకారం చేయజూస్తున్న బీజేపీ సర్కారు తీరును ఎక్కడికక్కడ ఎండగట్టారు. రైతులకు అండగా, కేంద్ర వైఖరిని నిరసిస్తూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునందుకుని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కదం తొక్కారు. ధాన్యం కొనేదాకాల కొట్లాట తప్పదని అల్టిమేటం జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ సోమవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ఊళ్లకు ఊళ్లు కదిలివచ్చిన రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన సెగ ఢిల్లీకి తాకేలా రణం చేశారు. బీజేపీకి చావుడప్పు కొట్టారు. ప్రధాన మంత్రి మోదీ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుకు తెచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, చౌటుప్పల్‌లో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఆలేరులో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసనలు హోరెత్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు రైతులు ఉద్యమంలా తరలివచ్చి ర్యాలీలు నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భువనగిరిలోని వినాయక చౌరస్తా వద్ద చేపట్టిన నిరసనలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జడల అమరేందర్ గౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, చౌటుప్పల్‌లో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.. రామన్నపేటలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆలేరులో మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి.. మోత్కూరులో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్న అన్యాయాన్ని ఈ సందర్భంగా నేతలు ఎండగట్టారు. బీజేపీ నాయకుల కుట్రలను బట్టబయలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై టీఆర్ఎస్ కొంతకాలంగా చేస్తున్న పోరాటాలు, తాజాగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలు టీఆర్ఎస్ శ్రేణులు, రైతుల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపాయి.
ఆవిష్కృతమైన ఉద్యమనాటి దృశ్యాలు
నిరసన కార్యక్రమాల నిర్వహణకు గ్రామ, మండల స్థాయిల్లో రెండు మూడు రోజుల ముందుగానే ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నాయకులు సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో సోమవారం నాటి కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే పల్లెల్లో నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. అన్నిచోట్లా కేంద్రంపై చావు డప్పు మోగించారు. పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, పీఎం మోదీ దిష్టిబొమ్మలకు పాడెకట్టి శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ నాయకులు ఖబడ్డార్.. అంటూ రైతులు, టీఆర్ఎస్ నాయకుల నినాదాలు మార్మోగాయి. ఈ కార్యక్రమాలు ఒకప్పటి తెలంగాణ ఉద్యమనాటి ఘటనలను తలపించాయని పార్టీ శ్రేణులు చర్చించుకోవడం కన్పించింది.
బుద్ధి లేని బీజేపీని బొంద పెట్టాలె
దేశానికి అన్నం పెట్టే రైతులను కేంద్ర ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇలాంటి చేతగాని
ప్రభుత్వాన్ని నేనెప్పుడూ చూడలే. వడ్లు కొనమంటే రాజకీయం చేస్తున్నది. మాది గొప్ప ప్రభుత్వమని దేశాలు తిరిగి చెప్పుతున్న మోదీ, ఏడేండ్లు పాలించి రైతులకు ఏం చేసిండో కూడా చెప్పాలె. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగు పడ్డట్టు చరిత్రలో లేదు. ఇలాంటి పార్టీలు అధికారంలో ఉంటే రైతులకు ఇబ్బందులు తప్పవు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఊర్లళ్ల ఎట్ల తిరుగుతరో మేం గూడ చూస్తం. బుద్ధిలేని బీజేపీని రాబోయే ఎన్నికల్లో రైతులంతా బొంద పెట్టాలె.