Valentines Day | ‘వాలెంటైన్స్ డే’ బహుమతులు అంటే.. ఏదో ఓ వస్తువును చేతికి ఇవ్వడం కాదు. అది భాగస్వామి జీవనశైలికి ఊహించని అప్‌గ్రేడ్‌ను అందివ్వాలి. తియ్యని కుకీలంటే పడిచచ్చే జెన్-జీ అయినా; ఆధునిక సాంకేతికతను కోరుకునే టెక్ ప్రియుడైనా; సంగీతమంటే చెవి కోసుకునేవాడైనా.. భాగస్వామికి నచ్చే, మెచ్చే గిఫ్ట్ ఇవ్వాలని తహతహలాడుతుంటారు. ఈక్రమంలో ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్.. ఈయేటి మేటి ‘వాలెంటైన్స్ డే గిఫ్ట్స్’ జాబితాను సిద్ధం చేసింది. వాటిపై ఓ లుక్కేయండి. మీ లవర్‌కు సూటవుతాయని అనిపిస్తే.. వెంటనే ఆర్డర్ పెట్టేయండి. మీ వాలెంటైన్‌కి ప్రేమతో ఓ కానుకను అందివ్వండి.

మంచి డెజర్ట్.. ఎలాంటి హృదయాన్నైనా కరిగిస్తుంది. అందుకే, లగ్జరీ కుకీ బ్రాండ్ లాస్ట్ క్రంబ్.. ఏటా వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని ప్రత్యేక కుకీలను రూపొందిస్తుంది. ఈ ఏడాది వార్నర్ బ్రదర్స్‌తో కలిసి.. 2026 వాలెంటైన్స్ డే కలెక్షన్‌కు రూపకల్పన చేసింది. ‘వూథరింగ్ హైట్స్’ సినిమా థీమ్‌తో ప్రేమ, విరహం, ఎమోషన్స్ ఆధారంగా ఈ కుకీలకు తయారుచేసింది. లాస్ట్ క్రంబ్ సిగ్నేచర్ బ్లాక్ బాక్స్‌పై సినిమా థీమ్‌కు తగ్గట్టుగా మెటాలిక్ టైపోగ్రఫీ, ప్రత్యేకమైన ఆర్ట్ వర్క్‌తో ఈ లిమిటెడ్ ఎడిషన్ బాక్స్ లభిస్తుంది. ఇందులో మొత్తం 12 కుకీలు ఉంటాయి. అందులో ప్రతిదీ రెండు చొప్పున.. 6 రకాల ఫ్లేవర్లు ఉంటాయి. ప్రేమికుల రోజును మరింత తియ్యగా జరుపుకోవడానికి ఇంతకుమించిన గిఫ్ట్ ఉండబోదని ఫోర్బ్స్ చెబుతున్నది.
భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరుచుకోవడానికి, ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకోవడానికి రూపొందించిన పాపులర్ కార్డ్ గేమ్.. ది కపుల్స్ గేమ్. వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఆప్షన్లలో తెగ ట్రెండ్ అవుతున్నది. యువ ప్రేమికులు మొదలుకొని నవ దంపతులు సహా ఆన్లైన్లో దీనికోసమే వెతుకుతున్నారట. అందుకే, ఫోర్బ్స్ కూడా ఈ గిఫ్ట్‌కు తన జాబితాలో చోటు అందించింది. ఈ కపుల్ గేమ్ ఎందుకింత ప్రత్యేకమంటే.. రోజువారీ బిజీ జీవితంలో మనం మర్చిపోయే చిన్నచిన్న విషయాలను కూడా గుర్తు చేస్తుంది. ఒకరి అలవాట్లపై మరొకరు జోకులు వేసుకుంటూ.. నవ్వుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇక ఫోన్లకు దూరంగా ఉంచి.. దంపతులిద్దరూ నాణ్యమైన సమయాన్ని గడపడానికి చక్కని మార్గంగా ఉపయోగపడుతుంది.

మీ పార్ట్నర్కు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువా? ఆకుకూరల్ని ఇష్టంగా తింటారా? అయితే, ఈ వాలెంటైన్స్ డేకు ‘ఏరోగార్డెన్ స్ప్రౌట్ హైడ్రోపోనిక్ ఇండోర్ గార్డెన్’ను కానుకగా అందించండి. నట్టింట్లో పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, సొంతంగా ఆకుకూరలు పండించుకునే అవకాశాన్ని కల్పించండి. కానుకతోపాటు ఆరోగ్యాన్నీ ప్యాక్ చేసి ఇవ్వండి. అ స్మార్ట్ హైడ్రోపోనిక్ సిస్టమ్.. మట్టి లేకుండా ఇంట్లోనే మొక్కలను పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో ఒకేసారి మూడు రకాల మొక్కలను (కొత్తిమీర, పుదీనా, తులసి వంటి హెర్బ్స్) పెంచుకోవచ్చు. టమాటాలు, మిర్చి లాంటివీ పండించుకోవాలంటే.. కొంచెం పెద్ద సైజు ఏరోగార్డెన్ మోడల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
సంగీతం.. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇద్దరి మధ్య ప్రేమను, అనురాగాన్ని పెంచుతుంది. అందుకే, ప్రఖ్యాత ఆడియో సంస్థ మార్షల్ రూపొందించిన ‘విల్లెన్-2’కీ.. ‘ఫోర్బ్స్-వాలెంటైన్స్ డే’ గిఫ్ట్‌ల జాబితాలో చోటు దక్కింది. అరచేతి పరిమాణంలో ఉండే ఈ బ్లూటూత్ స్పీకర్.. ప్రేమ పక్షులు పిక్నిక్కు వెళ్లినా, ప్రయాణాలకు వెళ్లినా వెంటే వస్తుంది. నచ్చిన సంగీతాన్ని వినిపిస్తుంది. ఈ విల్లెన్-2 స్పీకర్.. పాత వెర్షన్‌తో పోలిస్తే మెరుగైన సౌండ్, బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. పరిమాణం చిన్నదైనప్పటికీ.. మార్షల్ సిగ్నేచర్‌తో ఫుల్ బేస్, స్పష్టమైన సౌండ్‌ను వినొచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే.. 17 గంటల కంటే ఎక్కువ సమయం ప్లేబ్యాక్ ఇస్తుంది. ఇందులోని మైక్రోఫోన్ సాయంతో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ప్రేమికులిద్దరూ కబుర్లలో మునిగితేలవచ్చు.
నవతరం కళ్లెప్పుడూ ఆధునిక టెక్నాలజీపైనే ఉంటాయి. ఇక ఫిట్నెస్ ఫ్రీక్స్, మ్యూజిక్ లవర్స్ అయితే.. వారి మనసెప్పుడూ ‘ఎయిర్‌పాడ్స్’ చుట్టే తిరుగుతాయి. మీరూ అంతేనా!? అయితే, ‘ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2’ గిఫ్ట్ కింద ఇవ్వాల్సిందే! ఈ బహుమతి ఇద్దరికీ ఉపయోగపడుతుంది. చెరో ఎయిడ్ప్యాడ్ చెవిలో పెట్టుకొంటే.. ఇద్దరూ ఒకే సమయంలో ప్లగిన్ చేసినట్లుగా, నచ్చిన పాటల్ని వింటూ ప్రేమికుల రోజును ఉల్లాసంగా గడిపేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ వైర్లెస్ ఇయర్ బడ్స్లలో ‘ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2’ ఒకటి. అనేక అత్యాధునిక ఫీచర్లతో మునుపటి కంటే మెరుగైన ఆడియో క్వాలిటీతో వస్తున్నాయి. ఆక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ వల్ల బయటి శబ్దాలను పూర్తిగా తగ్గిస్తుంది. ప్రయాణాల్లో, రద్దీ ప్రదేశాల్లో అద్భుతంగా పనిచేస్తుంది.