యూరప్ ఖండంలో అతి ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన భువనగిరి యువతి
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి):భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్వితారెడ్డి పర్వతారోహణను హాబీగా చేసుకున్నారు. తన శక్తిని చాటి యూరప్ ఖండంలోనే ఎత్తైన ‘ఎల్ బ్రస్’ పర్వతాన్ని అధిరోహించారు. ఓ వైపు మంచు తుఫాను, రక్తం గడ్డ కట్టే -40డిగ్రీల చలి, గంటకు 60కిలోమీటర్ల వేగంతో వీచే గాలి.. అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ కేవలం 5.10గంటల వ్యవధిలోనే సమ్మిట్‌ను పూర్తి చేసిం వింటర్లో ఎల్ బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా, దక్షిణ భారత దేశం నుంచి తొలి వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించి ప్రశంసలు అందుకుంటున్నది. ఈ సందర్భంగా అన్వితా రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించి తన సాహస ప్రయాణాన్ని చెప్పుకొచ్చారిలా…
భువనగిరి టు రష్యా ప్రయాణం ఇలా..
భువనగిరి నుంచి నవంబర్ 27న తెల్లవారుజామున రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాం. ఢిల్లీ మీదుగా రష్యాలోని మాస్కో ఎయిర్‌పోర్టుకు 28న రాత్రి చేరుకున్నాం. నెల రోజుల క్రితం ఇదే పర్వతాన్ని అధిరోహించిన 20 మంది బృందంలో ఐదుగురు చనిపోయారని విన్నాను. నేను బయల్దేరేనాటికి వాతావరణం సైతం అనుకూలంగా లేదు. ఇంట్లో వాళ్లు కూడా ఫోన్ చేసి ‘సమస్యగా ఉంటే.. తిరిగి వచ్చేసెయ్’ అన్నారు. కానీ, నేను మాత్రం వెనక్కి రావొద్దని నిర్ణయించుకున్నా. నా మొండి ధైర్యాన్ని చూసి నా వెంట వచ్చిన గైడ్ కూడా ఆశ్చర్యపోయాడు.
అవేవీ నా లక్ష్యానికి అడ్డంకి కాలేదు…
ఎల్ బ్రస్ పర్వతారోహణ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే లద్దాఖ్‌లో శిక్షణ తీసుకున్నా. కానీ, శిక్షణకు, ప్రస్తుతం ఎల్బ్రస్ పర్వతం వద్ద పరిస్థితులకు చాలా తేడా ఉంది. పొద్దస్తమానం మంచు, -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. గంటకు 60కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు.. ఇలా అన్నీ నా సాహస యాత్రకు అవరోధాలుగా నిలిచాయి. గతంలో పర్వతారోహణ సందర్భంగా ఈ తరహా పరిస్థితులను ఎన్నో చూశా కాబట్టి అవేవీ నా లక్ష్యానికి అడ్డంకి కాలేదు. అక్కడి పరిస్థితులను చూసి బెంబేలెత్తకుండా నవంబర్ 29, 30 తేదీల్లో 3,500మీటర్ల ఎత్తులోకి వెళ్లడం.. తిరిగి వెనక్కి రావడం ప్రాక్టీసు చేశా. డిసెంబరు 4న 4వేల మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంపునకు చేరుకున్నా. అక్కడ 10మీటర్ల పొడవున్న జాతీయ పతాకాన్ని ఎగుర వేశాను. రెండు రోజులు ఆగిన తర్వాత పర్వతం శిఖరం చేరుకునేందుకు లగేజీతో బయల్దేరా. అర్ధరాత్రి గడిచాక.. 7వ తేదీన మసకచీకట్లో 2 గంటల సమయంలో నా ప్రయాణం మొదలైంది. ప్రతికూల వాతావరణంలో 7కేజీల బరువును మోస్తూ పర్వతారోహణ కోసం అడుగులు వేశా. వేలమీటర్ల ఎత్తులో చాలీచాలని ప్రాణ వాయువు, తాగేందుకు నీరు దొరకదు. ఎటుచూసినా మంచు పర్వతాలే. ప్రపంచంతో సంబంధాలు తెగినట్టు అనిపించింది. అయితే గమ్యం చేరేందుకు వేసిన అడుగులతో అప్పటి వరకూ మనసులో ఏదోమూలన ఉన్న భయాలన్నీ పటాపంచలయ్యాయి. 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతం శిఖరాగ్రానికి డిసెంబర్ 7న ఉదయం రష్యా కాలమానం ప్రకారం 9.10గంటలకు చేరుకున్నా. అదే రోజు సాయంత్రానికి తిరిగి బేస్ క్యాంపుకు చేరుకున్నా. ఎల్బ్రస్ పర్వతారోహణకు ఎంతలేదన్నా.. 8 గంటల సమయం పడుతుంది. కానీ, నేను 5 గంటల 10 నిమిషాల వ్యవధిలోనే సమ్మిట్‌ను పూర్తి చేశా.
మహిళలకు కొండంత బలం…
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న యెర్రంబెల్లి గ్రామం మా సొంతూరు. అమ్మానాన్న పడమటి మధుసూదన్‌రెడ్డి, చంద్రకళ. అక్కకు పెళ్లయ్యింది. నాన్న వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. అమ్మ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. మా చదువుల నిమిత్తం ఇరవైఏళ్ల క్రితం నుంచే మా కుటుంబం భువనగిరికి వచ్చి స్థిరపడింది. బుద్దిగా చదువుకోక.. ఆడపిల్లకు ఈ అభిరుచి ఏంటి? అని ఎత్తిపొడిచినవాళ్లూ ఉన్నారు. అయితే అందరిలా.. అమ్మానాన్నలు నా ఇష్టానికి అభ్యంతరం చెప్పలేదు. నేను చిన్నప్పటి నుంచీ మగరాయుడిగానే పెరిగాను. బైక్‌పై అమ్మను కూర్చోబెట్టుకుని అంగన్వాడీ సెంటర్ వద్ద దించడం, తిరిగి ఇంటికి తీసుకురావడం చేస్తుంటా. అప్పుడప్పుడు నాన్నకు సాయంగా ఉండేందుకు ట్రాక్టర్‌ను కూడా నేర్చుకున్నా. ఇంటర్ చదువుతుండగానే పర్వతారోహణపై ఏర్పడిన ఆసక్తితో భువనగిరి రాక్ ైక్లెంబింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నా. దూరవిద్యలో ఎంబీఏ పూర్తి చేశాక భువనగిరికి తిరిగొచ్చి రాక్ ైక్లెంబింగ్ స్కూల్లోనే శిక్షకురాలిగా ఉద్యోగం చేస్తున్నా. అమ్మకు నేను ప్రభుత్వం ఉద్యోగం చేయాలన్నది కోరిక. కానీ, నాకు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక పర్వతాన్ని అధిరోహించి ప్రత్యేక గుర్తింపు పొందాలని అనుకుంటా. ఇప్పటికే సిక్కింలోని రెనాక్, బీసీరాయ్ పర్వతాలను, ఆఫ్రికాలోని కిలిమంజారో, లద్ధాఖ్లోని కడే పర్వతాలను అధిరోహించాను. త్వరలోనే రష్యాలోని అకాంగో పర్వతాన్ని కూడా అధిరోహించాలని అనుకుంటున్నా.