
యాదాద్రి, డిసెంబర్24 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు మంగళ హారతులతో పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. స్వామివారి ఆర్జిత పూజలు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. బాలాలయం ముఖ మండపంలో స్వామికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా రూ.600 టిక్కెట్ తీసుకున్న భక్తులు సువర్ణ పుష్పార్చన జరిపించారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బాలాలయంలో తిరుప్పావై వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు వేద మంత్రాలు పటిస్తూ గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలలో తొమ్మిదో పాశురాలను భక్తులకు వినిపించారు. అన్ని విభాగాల నుంచి రూ.13,27,817 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.