
ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
టీఆర్ఎస్ అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు
పట్నం మహేందర్ రెడ్డి మూడు సెట్లు, శంభీపూర్ రాజు రెండు సెట్లు
స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు
నేడు నామినేషన్ల పరిశీలన
ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ దూరం
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, నవంబర్ 23 : ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు ఒక్కో సెట్ నామినేషన్లను మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.అమయ్‌కుమార్‌కు అందజేశారు. అంతకు ముందు మహేందర్‌రెడ్డి రెండు సెట్లు, శంభీపూర్ రాజు ఒక సెట్ నామినేషన్లను దాఖలు చేయగా, మొత్తం ఐదు సెట్ల నామినేషన్లను టీఆర్ఎస్ అభ్యర్థులు దాఖలు చేశారు. చివరి రోజు స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. నేడు నామినేషన్ల పరిశీలన, ఈ నెల 26 వరకు ఉపసంహరణకు గడువు, డిసెంబర్ 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటర్లు లేని కారణంగా ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఆఖరు రోజైన మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్ రెడ్డితోపాటు శంభీపూర్ రాజు మరో సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.అమయ్‌కుమార్‌కు అందజేశారు. పట్నం మహేందర్‌రెడ్డి నామినేషన్‌ను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, దయానంద్‌గుప్తా, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి బలపర్చారు. శంభీపూర్ రాజు నామినేషన్‌ను ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి బలపర్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, మరో అభ్యర్థి శంభీపూర్ రాజు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు చివర్లో స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. నేడు నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 26 వరకు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు గడువుండగా, డిసెంబర్ 10న రెండు స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడిస్తారు.
ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ దూరం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలు మొదట్నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించినప్పటికీ చివరి రోజు నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేస్తారని ప్రచారం జరిగినా.. కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు పోటీపై కనీసం బీజేపీలో చర్చ కూడా జరుగకపోవడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల మొత్తం 1179 మంది ఓటర్లుండగా, వీరిలో 1100 మంది వరకు ఓటర్లు టీఆర్‌ఎస్‌వారే ఉండడంతో ప్రతిపక్ష పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలు పరువు కాపాడుకునేందుకు పోటీ చేయాలని అనుకున్నా.. పోటీ చేసేందుకు అభ్యర్థులెవరూ ముందుకు రాకపోవడంతో తోక ముడిచినట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది.
ఇరువర్గాల మధ్య తోపులాట, లాఠీచార్జి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకుగాను స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ రావడంతో రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతోపాటు పోటాపోటీగా నినాదాలు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతోపాటు పలువురిపై లాఠీచార్జి చేయడంతో గొడవ సద్దుమణిగింది.
కసిరెడ్డి నారాయణరెడ్డి నామినేషన్
ఆమనగల్లు, నవంబర్ 23 : ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఆమనగల్లు బ్లాక్ కడ్తాల, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాల నుంచి పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మహబూబ్‌నగర్‌కు తరలివెళ్లారు. కడ్తాల ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, ఆమనగల్లు ఎంపీపీ అనిత, టీఆర్ఎస్ జిల్లా నాయకులు వస్పుల జంగయ్య, హన్మానాయక్ ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.