-వాడవాడలా గులాబీ జెండాలు
బంజారాహిల్స్ : జై తెలంగాణ .. జై కేసీఆర్ అంటూ నినాదాలు.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు.. వాడవాడలా జెండా పండుగలు.. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో అడుగడుగునా పండుగ వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ. సోమాజిగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలో గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలాయి.
బస్తీలు, కాలనీల్లో జెండా పండగ నిర్వహించారు. జై తెలంగాణ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్, ఎన్బీటీనగర్ తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉదయంనుంచే అన్ని డివిజన్లలో పర్యటించి జెండా పండుగలో పాల్గొన్నారు. ఫిలింనగర్‌లోని శంకర్ విలాస్ చౌరస్తాలో జెండా పండగ కార్యక్రమంలో భాగంగా మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ. టీఆర్ఎస్ నేత మామిడి నర్సింగరావుతో కలిసి జెండా ఎగురవేశారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి డివిజన్‌తో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి జెండాలు ఎగురవేశారు.
వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి. సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతాయాదవ్ తదితరులు జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఫిలింనగర్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా టీఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్ల శివ మాదిగ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.