పాల్వంచ, జనవరి 3: ఆస్తి పంపకాల విషయంలో తనకు అన్యాయం జరుగుతున్నదని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్ లీక్ చేసి, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఘటనలో తనతో పాటు భార్య, కుమార్తె సజీవ దహనమయ్యారు. మరో కుమార్తె గాయాల పాలై ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత పాల్వంచలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఏఎస్పీ రోహిత్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ రామకృష్ణ(45) అనే వ్యక్తి భార్య శ్రీలక్ష్మి (40), కుమార్తెలు సాహిత్య (13), సాహితి, విశ్రాంత ఉద్యోగి అయిన తల్లి సూర్యావతితో కలిసి పాల్వంచలో నివాసం ఉంటున్నాడు. గతంలో తండ్రి చనిపోవడంతో తల్లిని తానే పోషిస్తున్నాడు. నవభారత్ సెంటర్లో మీసేవా కేంద్రాన్ని నడిపిస్తున్న రామకృష్ణ కొద్ది నెలలుగా అప్పుల బాధలో ఉన్నాడు. గతంలో వివిధ వ్యాపారాలు చేసి రూ.25 లక్షల వరకు నష్టపోయాడు. మూడునెలల క్రితం మీసేవా కేంద్రాన్ని విక్రయించాడు. ఆ తర్వాత పాల్వంచ నుంచి కుటుంబంతో సహా ఏపీలోని రాజమండ్రికి వెళ్లాడు. అక్కడ వాహనాలకు స్టిక్కర్లు అంటించే డిస్ట్రిబ్యూటర్ చిప్స్ ప్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారు డబ్బులు ఇవ్వాలని మరింత ఒత్తిడి చేశారు. దీంతో రామకృష్ణ ఆస్తులు పంచాలని తల్లిని కోరాడు. తల్లి సూర్యావతి, అక్క లోవా మాధవి ఈ విషయంపై వనమా రాఘవ వద్ద పంచాయితీ పెట్టించింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ రామకృష్ణ ఆదివారం సాయంత్రం కుటుంబంతో కలిసి పాల్వంచలోని ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం రామకృష్ణ ఇంట్లో తలుపులు మూసి గ్యాస్ లీక్ చేశాడు. ఒంటిపై పెట్రోల్ చల్లుకున్నాడు. కుటుంబ సభ్యులందరిపైనా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చిన్న కుమార్తె సాహితికి ఒంటిపై చల్లగా అనిపించి నిద్ర లేచి చూసింది. తనకూ మంటలు అంటుకోవడాన్ని గమనించింది. తల్లిదండ్రులు, సోదరి మంటల్లో దహనం అవుతుండగా బయటకు పరుగు తీసింది. ప్రాణాలతో బయటపడింది. నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి, సాహిత్య సజీవ దహనమయ్యారు. చిన్న కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొట్టుమిట్టాడుతున్నది. సమాచారం అందుకున్న ఏఎస్పీ రోహిత్‌రాజు, సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రవీణ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఇంటిబయట ఉన్న కారులో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చిన్న కుమార్తె సాహితి చెప్పిన ఆధారాలు, మృతుడి బావమరిది ఫిర్యాదు మేరకు వనమా రాఘవ, మృతుడి తల్లి, అక్కపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. పక్కా ప్రణాళికతోనే రామకృష్ణ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడని ఆయన తెలిపారు. మృతుడి సూసైడ్ నోట్లో తన మృతికి కారణం వనమా రాఘవ, తల్లి సూర్యావతి, అక్క లోవా మాధవి కారకులు అని, వనమా రాఘవ తల్లి, అక్కకు అనుకూలంగా వ్యవహరించాడని పేర్కొన్నాడు.
అమ్మను బాగా చూసుకోమని చెప్పా.. : వనమా రాఘవ
భద్రాద్రికొత్తగూడెం జనవరి 3 (నమస్తే తెలంగాణ): పాత పాల్వంచలో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు, కుమార్తె సాహిత్య మృతి ఘటనపై వనమా రాఘవ స్పందించారు. ‘మా కుటుంబంపై రాజకీయ కుట్ర జరుగుతున్నది. రామకృష్ణ కుటుంబం సజీవ దహనంతో నాకు సంబంధం లేదు. రామకృష్ణ అప్పుల బాధతో చనిపోయాడు. నన్ను రాజకీయంగా ఎదగనీయకుండా కొందరు కుట్ర పన్నారు. మా ఇంటికి ఎంతో మంది ఎన్నో రకాల సమస్యల పరిష్కారం కోసం వస్తారు. అలాంటి సమస్యల్లో రామకృష్ణ సమస్య ఒకటి. అతడిని పిలిచి అమ్మను బాగా చూసుకో అని చెప్పా. నేను రామకృష్ణను ఏమీ అనలేదు. సూసైడ్ నోట్లో నా పేరు ఎందుకు రాశాడో తెలియదు. గతంలోనూ నాపై చాలా కేసులు పెట్టారు. అవేమీ నిలబడలేదు. తప్పుడు కేసులు పెడితే నేను భయపడను. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం..’అని వివరణ ఇచ్చారు.