
గణనీయంగా పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు
బారెడు పొద్దెక్కినా తొలగని మంచు తెరలు
ఉదయం 9 దాటినా తగ్గని చలి తీవ్రత
సాయంత్రం నాలుగింటికే మొదలవుతున్న చలి
బయటకు రావాలంటేనే జంకుతున్న జనం
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
ఖమ్మం, డిసెంబర్ 22: ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతోంది. మునుపెన్నడూ లేనంతగా జనాన్ని గజగజా వణికిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీని హడలెత్తిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు రోడ్లమీదకు రావాలంటేనే జంకుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, విధుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు ప్రయాణించే ఉద్యోగులు, పనుల కోసం పట్టణాలకు వచ్చే కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక వృద్ధులు, రోగులు వణికిపోతున్నారు. ఇక తెల్లవారుజామునే పాలు పోసేవారు, కూరగాయలు విక్రయించే వారు, పేపర్ వేసే వాళ్లు, మార్కెట్ హమాలీలైతే ఎంత చలితీవ్రత ఉన్నా ముందుకు సాగుతున్నారు.
పెద్దలు చెప్పినట్లుగా సంక్రాంతి రాకముందే చలి చంపేంత పని చేస్తోంది. ఇంకా 25 రోజుల సమయం ఉండగానే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వాతావరణంలో సంభవించిన పెనుమార్పుల కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఉదయం పెద్దగా పనులు లేని వాళ్లయితే ఏకంగా దుప్పట్లో ముసుగుతన్ని పడుకుంటున్నారు. కానీ స్కూలుకు వెళ్లే పిల్లలకు వంట సిద్ధం చేసే గృహిణులు మాత్రం డీప్ ఫ్రిజ్లో పెట్టినట్లుగా ఉండే నీళ్లలో పనులు చక్కదిద్దుతున్నారు.
గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
వాతావరణ మార్పుల కారణంగా మునుపెన్నడూ లేనంతగా ఈ ఏడాది పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం పది దాటినా మంచు కురుస్తూనే ఉంది. సాయంత్రం 4 గంటల నుంచే చల్లని గాలులు వీస్తున్నాయి.
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
చలి తీవ్రత కారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ప్రధానంగా శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులు తీవ్రమై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లలోపు చిన్నారులు జబ్బుల బారినపడుతున్నారు. తీవ్రమైన చలి ఉంటే జలుబు, గొంతునొప్పి, సైనసైటిస్, న్యుమోనియా, ఆస్తమా తదితర వ్యాధులు సంభవించే ప్రమాదముంటుంది. అనివార్యంగా ప్రయాణం చేయాల్సినవారు, బయటికి వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందంటున్నారు. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నవారు, స్టెరాయిడ్లు వాడుతున్న వారు, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు బయటికి వెళ్లాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చలితీవ్రత ఎక్కువగా ఉన్న ఉదయం వేళలో వాకింగ్ చేయకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే వారితోపాటు మిగతావారు కూడా శరీరమంతా కప్పేలా ఉన్ని వస్ర్తాలు ధరించాలి. చెవి, ముక్కు, నోటి నుంచి గాలి లోపలికి వెళ్లకుండా మఫ్లర్ వాడాలి. ఇంట్లో ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. ఎప్పుడు స్నానం చేసినా గోరువెచ్చని నీటినే ఉపయోగించాలి. చర్మం పొడిబారకుండా తేమను పెంచే క్రీములు వాడాలి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు బయటికి వెళ్లకూడదు. తీవ్రమైన చలితో చేతులు పట్టు తప్పుతాయి. అందువల్ల అత్యవసరమైతే తప్ప రాత్రిళ్లు, తెల్లవారు జామున వాహనాలు నడపకపోవడమే మంచిది. ఆస్తమా రోగులు తప్పనిసరిగా ఇన్హేలర్లను వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ఇలా కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే చలి పంజా నుంచి తప్పుకోవచ్చు.