మానకొండూర్ రూరల్, డిసెంబర్ 30: గ్రామ ప్రజలు కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఎంపీవో ప్రభాకర్ కోరారు. గురువారం చెంజర్లలో సర్పంచ్ బొల్ల వేణుగోపాల్, ఎంపీవో ప్రభాకర్, నాయబ్ తహసీల్దార్ ఖాజామొయినొద్దీన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని గ్రామస్తులకు సూచించారు. నాయబ్ తహసీల్దార్ మాట్లాడుతూ కులం పేరుతో ఎవరైనా దూషిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, రెవెన్యూ సిబ్బంది, వార్డు సభ్యులు, ఆశ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎరడపల్లిలో..
శంకరపట్నం, డిసెంబర్ 30: ఎరడపల్లిలో రెండు గ్లాసుల పద్ధతి, అంటరానితనం వంటి సమస్యలు లేవని సర్పంచ్ కలకుంట్ల రంజిత్‌రావు పేర్కొన్నారు. గురువారం ఎరడపల్లి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో కులమతాలకతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నట్లు వెల్లడించారు. గ్రామంలోని దళితులకు ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని గిర్దావర్ లక్ష్మారెడ్డి తెలిపారు. గ్రామస్తులంతా కలిసి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తాడికల్ విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈఈ ఎం శ్రీనివాస్, ఉప సర్పంచ్ తిరుమల, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.