
కూసుమంచి రూరల్, జనవరి 6 : అవి కరువు ప్రాంతాలని, అక్కడివన్నీ నెర్రెలు వారిన బీళ్లేనని అంటుండేవారు పొరుగు జిల్లాల ప్రజలు. కానీ అవే బీడు వారిన ప్రాంతాలు ఇప్పుడు పొరుగు రాష్ర్టాల కూలీలకు ఉపాధినిచ్చేంత అభివృద్ధి సాధించాయి. తెలంగాణ ఆవిర్భావం, భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణం వంటి కారణాలతో ఆ ప్రాంతాల స్వరూపం సమూలంగా మారిపోయింది. వలసల గడ్డగా ముద్రపడిన ఈ ప్రాంతం ఇప్పుడు వ్యవసాయ రంగంలో జీవనోపాధి కల్పించే అడ్డా అయింది. ఏకంగా బీజేపీ పాలిత రాష్ట్ర కూలీలకు ఉపాధి కల్పించేంతలా ఎదిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం, భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణం వంటి కారణాలతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. సీఎం కేసీఆర్ అందించిన రైతుబంధు వంటి పథకాలతో రైతులు ఈ ప్రాంతంలో సిరులు పండిస్తున్నారు. ఈ ప్రాంత రైతుల దగ్గర కూలి పనులు చేసేందుకు ఇప్పటి వరకూ బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ర్టాల రైతులు వలస వచ్చే వారు. ఈ ఏడాది ఉత్తరాదిన ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ నుంచి కూడా కూలీలు వలస వచ్చారు. సుమారు 200 మంది కూలీలు కూసుమంచి మండలంలోని కొత్తూరు, నర్సింహులగూడెం, ఎర్రగడ్డతండా పరిసర గ్రామాల్లో ప్రస్తుతం వరినాట్లు వేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఎకరా పొలం నాటు వేయడానికి ఉత్తరాఖండ్ కూలీలకు రూ.3,500 చొప్పున కూలి చెల్లిస్తున్నట్లు కొత్తూరు గ్రామ రైతు బజ్జూరి వెంకటరెడ్డి చెప్పారు.