సుల్తాన్‌బజార్ : ప్రయాణీకులే మా దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు దూసుకువెళ్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకుల సౌకర్యార్ధం నూతన పనులకు శ్రీకారం చుడుతోంది. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ భాధ్యతలను చేపట్టిన అనంతరం ఆర్టీసీ అభివృధ్దికి ఎన్నో నూతన కార్యక్రమాలను చేపడుతూ ఆర్టీసీ లాభాలబాటలో నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌కు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాలకు వెళ్ళేందుకు గాను చేరుకునే ప్రయా ణీకులను సీబీఎస్ నుండి బస్టాండ్‌లోని ఫ్లాట్ ఫారంల వరకు ఉచితంగా చేరవేసేందుకు బగ్గీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ వాహనం సీబీఎస్ రోడ్డుపైన బస్సులు,ఆటోలు దిగినవారిని ఎంజీబీఎస్ ఫ్లాట్ ఫారం వరకు చేరవేస్తుంది. ఈ బగ్గీ సేవలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఎంజీబీఎస్ అసిస్టెంట్ మేనేజర్ సుధ పేర్కొన్నారు. ప్రయాణీకులకు ఎంతో సౌలభ్యంగా ఉన్న ఈ బగ్గీ వాహనాల సంఖ్యను పెంచేందుకు ఉన్నతాధికారులు కసరత్తును ప్రారంభించారు.