యాదాద్రి, డిసెంబర్22 : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో అర్చకులు వేద మంత్రాలు పటిస్తూ తిరుప్పావై పూజలను వైభవంగా నిర్వహించారు. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలలో ఎనిమిదో పాశురాలను అర్చకులు పఠించారు. ఓం నమో నారాయణాయా అష్టాక్షరి మహా మంత్రానికి సంబంధించిన పాశురాలను పఠించినట్లు ఆలయ ప్రధానార్చకుడు మరింగంటి మోహనాచార్యులు తెలిపారు. ఈ పాశురంలో మూడు రకాల అర్థాలు, మూడు రకాల దేవుళ్లను గోదాదేవి అమ్మవారు ప్రార్థించారని చెప్పారు. ధనుర్మాసంలో భక్తులు ఆలయాలను దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు.
శాస్ర్తోక్తంగా స్వామివారి నిత్యకల్యాణం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్ర్తోక్తంగా జరిపారు. వేకువజామునే బాలాలయంలో కవచమూర్తులకు ఆరాధనలు, పంచామృతాలతో అభిషేకం, తులసి అర్చనలు చేశారు. అనంతరం లక్ష్మీనరసింహులను అలంకరించి సుదర్శన హోమం జరిపారు. లక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతోపాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన గల రామలింగేశ్వర బాలాలయంలో నిత్యారాధనలు జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ. 7,76,108 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా
ప్రచార శాఖ 18,000
రూ.100 దర్శనం టిక్కెట్ 37,000
వేద ఆశీర్వచనం 7,800
క్యారీబ్యాగుల విక్రయం 5,500
వ్రత పూజలు 47,200
కల్యాణకట్ట టిక్కెట్లు 13,000
ప్రసాద విక్రయం 3,98,410
వాహన పూజలు 7,500
టోల్గేట్ 1,240
అన్నదాన విరాళం 10,698
సువర్ణ పుష్పార్చన 67,800
యాదరుషి నిలయం 45,800
పాతగుట్ట నుంచి 21,460
గోపూజ 300