
మామిళ్లగూడెం, డిసెంబర్ 24: వినియోగదారుల హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా అధికారులు, ఫోరమ్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై బిల్లు తీసుకోవడం వినియోగదారుల హక్కని అన్నారు. నాణ్యతా ప్రమాణాలులేని వస్తువులపై సంబంధిత అధికారులు నిఘా ఉంచాలని, నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఆ దిశగా వినియోగదారులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా వినియోగదారులను చైతన్యపరిచేందుకు ఫోరమ్ సభ్యులు జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో వస్తువుల కొనుగోలులో నష్టం కలిగితే నేరుగా ఫోరమ్‌లో అప్పీలు చేసుకొని నష్టపరిహారం పొందాలన్నారు. కల్తీ, నకిలీ వస్తువుల కొనుగోలు ద్వారా మోసపోయిన వినియోగదారులు ఫోరమ్‌ను ఆశ్రయించడం ద్వారా న్యాయ సహాయం పొందవచ్చునని వివరించారు. జిల్లా అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.