
ప్రయాణికుల సౌకర్యం కోసం టీఎస్ ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. సాధారణంగా పండుగ వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తారు. ఈసారి టీఎస్ఆర్టీసీ మాత్రం ప్రయాణికులపై ఎలాంటి భారం వేయడం లేదు. పండుగ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలే వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు,కొత్తగూడెం డిపో నుంచి 38, మణుగూరు నుంచి 55, భద్రాచలం నుంచి 83 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
కొత్తగూడెం అర్బన్, జనవరి 6: సంక్రాంతి పండుగకు నడిపే ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేయనున్నారు. ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవు ఉండడంతోపాటు వివిధ నగరాల్లో స్థిరపడిన వారంతా సంక్రాంతికి సొంతూళ్లకు వస్తుంటారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో రద్డీ బాగా ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి భద్రాద్రి జిల్లాలోని సొంతూళ్లకు వచ్చే ప్రయాణికులు, పండుగ తర్వాత తిరిగి నగరాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం శుక్రవారం నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
భారం లేదు..
సాధారణంగా పండుగ వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే అదనపు చార్జీలు వసూలు చేస్తారు. కానీ ఆర్టీసీ మాత్రం ప్రయాణికులపై ఎలాంటి భారం వేయడం లేదు. పండుగల ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. ఈ సంక్రాంతికి కొత్తగూడెం డిపో నుంచి 38, మణుగూరు నుంచి 55, భద్రాచలం నుంచి 83 కలిపి మొత్తం 176 బస్సులను నడపనున్నారు. హైదరాబాద్ ఎంజీబీఎస్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వలంటీర్లను సైతం నియమించి ప్రయాణికులకు సేవలందించనున్నారు. నిరుడు సంక్రాంతి సందర్భంగా ఈ మూడు డిపోల నుంచి 169 బస్సులను నడుపగా రూ.54 లక్షల ఆదాయం సమకూరింది.
సద్వినియోగం చేసుకోవాలి..
సంక్రాంతి పండుగ రద్డీ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నాం. సాధారణ చార్జీలతోనే ప్రయాణికులకు సేవలందిస్తాం. ముందస్తుగా సీట్లు కూడా రిజర్వ్ చేసుకునే వెసులుబాటు కల్పించాం. ప్రయాణికులకు సమాచారాన్ని అందించేందుకు ముఖ్యమైన కూడళ్లలో వలంటీర్లను నియమించి ఎప్పటికప్పుడు బస్సుల వివరాలను తెలియజేస్తాం.
-భవానీ ప్రసాద్, ఆర్టీసీ కొత్తగూడెం డీవీఎం