
అశ్వారావుపేట టౌన్, డిసెంబర్ 30: దుక్కి దున్నాక విత్తనాలు విత్త సమయం నుంచి మొదలు కొని ఎరువులు, పురుగుమందులను కొనడం, కూలీలు కూలి డబ్బులు చెల్లించడం వరకూ అన్ని ఖర్చులనూ రైతుబంధే ఆదుకుంటోంది. పంటను కూడా ఏడాదికి ఆ ఏడాది మార్చుతున్నా. ఇది వరకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా సాగు పనులు మొదలుపెట్టేవాణ్ని. అప్పుల కోసం అందరి దగ్గరకూ వెళ్లేవాణ్ని. కానీ మూడేళ్ల నుంచి పరిస్థితి అలా లేదు. ఇప్పుడు వర్షాలకు ముందే రైతుబంధు పంటల పెట్టుబడి సాయన్ని సీఎం కేసీఆర్ సార్ అందిస్తున్నారు. నా ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడినయని తెలియగానే బ్యాంకుకు వెళ్లి తెచ్చుకుంటున్నా. వస్తూ వస్తూనే విత్తనాలు ప్యాకెట్లు తెచ్చుకుంటా. మా ఊరి వెంకమ్మ చెరువు కింద నాకు ఎకరమున్నర పొలం ఉంది. రైతుబంధు కింద సీజన్‌కు రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు వస్తున్నాయి. సాగు పనులన్నీ వాటితోనే మొదలు పెడుతున్నా. విత్తనాలు, మందులతోపాటు కూలిల కూలి డబ్బులు కూడా వీటితోనే చెల్లిస్తున్నా. ఇంతకుముందు ఎక్కువగా మొక్కజొన్న వేసేవాణ్ని. ఈసారి మిరపతోట వేశా. ప్రస్తుతం మిర్చితోటకు పురుగుమందు కొడుతున్నా. యాసంగి రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాలో పడ్డాయంట. అవి డ్రా చేసుకొని వెళ్లి ఎరువుల కొట్లో కడతా. మొన్ననే పురుగుమందులు తెచ్చుకున్నా.
-ఏపుగంటి రామారావు, రైతు, ఊట్లపల్లి, అశ్వారావుపేట