
అలాట్మెంట్ జాబితా నమోదులో డీఈవో కార్యాలయ సిబ్బంది
ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 : కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా నిర్వహిస్తున్న విద్యాశాఖలోని విభజన ప్రక్రియ పూర్తి అయ్యింది. సబ్జెక్ట్లు, కేటగిరిల వారీగా సీనియార్టీ జాబితా తయారు చేయగా కలెక్టర్ ఆమోదించారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్, ములుగు జిల్లాల పరిధిలోని ఆప్షన్ల ప్రకారం సీనియార్టీ ఆధారంగా విభజన ప్రక్రియను నిర్వహించారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాలను విద్యాశాఖాధికారులు పరీశీలించి, అర్హత కలిగిన వాటిని మార్పులు చేశారు.
జాబితా నమోదు…
విభజన ప్రక్రియలో ఉన్నతాధికారుల ఆమోదం పొందిన జాబితాను డీఈఓ కార్యాలయ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు అలాట్మెంట్ అయిన జిల్లాలను వారి వివరాలను పొందుపరుస్తున్నారు. అన్ని కేటగిరిల ఉపాధ్యాయుల జాబితాను నమోదు అనంతరం నేరుగా ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం చేరవేసేలా రూపకల్పన చేశారు. సోమవారం నాటికి అంతర్ జిల్లాల బదిలీల్లో వచ్చిన టీచర్లు, మెడికల్ ప్రయోజనాలు కలిగిన వాటి నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. మంగళవారం నాటికి పూర్తిస్థాయిలో అన్ని కేటగిరిల ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ ముగియనుంది.