
కల్లూరు, జనవరి 7: అన్నదాతలు అప్పులపాలు కావొద్దనే సీఎం కేసీఆర్ ఆలోచన అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అప్పులు తెచ్చుకొని పంటలు సాగు చేస్తున్న కర్షకులు వ్యవసాయాన్ని భా రంగా భావించవద్దనే తపనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రైతుబంధు’ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. రైతులందరూ గుండె ధైర్యంతో సాగుకు కదులుతున్నారని అన్నారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా కల్లూరు మండలం పుల్లయ్యబంజర గ్రామంలో శుక్రవారం వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెరకు, ధాన్యపు లోడుతో ఉన్న ట్రాక్టర్లు, సంప్రదాయ దుస్తులతో రైతులతో కలిసి ఎమ్మెల్యే సండ్ర గ్రామంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక శివాలయం ఆవరణలో 20 బస్తాల ధాన్యపు గింజలు, బంతిపూలతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని గీశారు. ‘జై కేసీఆర్.. జై కేటీఆర్.. జై సండ్ర..’ అనే అక్షరమాలను రూపొందించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నపూర్ణగా తీర్చిదిద్దుతున్నారని, బృహత్తర పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతును రాజు చేశారని కొనియాడారు. కల్లూరు మండల రైతుల ఖాతాల్లో రూ.144 కోట్ల రైతుబంధు సాయం జమ అయిందని వివరించారు. తొలుత పుల్లయ్యబంజర గ్రామం చేరుకున్న ఎమ్మెల్యే సండ్రకు డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, పెద్దబోయిన మల్లేశ్వరరావు, పెద్దబోయిన నారాయణరావు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్ర్తాలు ధరించిన రైతులతోపాటు మహిళలు కుంకుమ బొట్టు పెట్టారు. కల్లూరు, పుల్లయ్యబంజర, తూర్పులోకవరం, పడమటిలోకవరం, కిష్టయ్యబంజర గ్రామాలకు చెందిన రైతులు స్వచ్ఛందంగా వచ్చి రైతుబంధు వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీపీ బీరవల్లి రఘు, రైతుబంధు సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణరావు, వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, కొరకొప్పు ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.