మాదాపూర్ : అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతదేహం దుర్గం చెరువులో నీటిపై తేలియాడుతూ కనిపించింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం … హసాన్ నగర్‌కు చెందిన ఎండీ సాజిద్ (25) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
ఈ నెల 1న డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ బృందం అనుకోకుండా దుర్గం చెరువు వద్దకు వెళ్లగా నీటిలో యువకుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. వారు మాదాపూర్ పోలీస్‌లకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి జేబులు తనిఖీ చేయగా సెల్ ఫోన్ లభ్యమైంది.
అది నీటిలో తడిసి స్విచ్ఛాఫ్ అయి ఉంది. అందులోని సిమ్ కార్డు వేరే సెల్ఫోన్లో వేసి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న అతని తండ్రి నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో మృతుడి తండ్రి ఖలీల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.