దుబ్బాక, డిసెంబర్ 30: చేనేతలను ఇబ్బందులకు గురి చేస్తున్న మోదీ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని, నేతన్నల ఊసురు తీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ సూచించా రు. చేనేత వస్ర్తాలు, ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ గురువారం దుబ్బాకలో చేనేత కార్మికులు ‘చేనేత మహా ధర్నా’ నిర్వహించారు. బీజేపీ, మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..పట్టణంలో ప్రధాన వీదులగుండా భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంగడీ బజారులో సాయంత్రం వరకు మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నాడు మహాత్మా గాంధీ చేపట్టిన ఉద్యమానికి చేనేత చరకం (రాట్నం) ప్రధాన ఆయుధంగా మారిందని గుర్తు చేశారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ నియంతపాలనకు చరమగీతం పాడేందుకు చేనేత కార్మికులు చేపట్టిన ఉద్య మం మరోసారి చరిత్రలో నిలువబోతున్నదన్నారు. చేనేతలను ఇబ్బందులకు గురి చేసేందుకే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేసిందని మండిపడ్డారు. చేనేతలకు మహాత్మాగాంధీ భూంకార్ యోజన పథకం రద్దు చేయటమేకాకుండా జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచ డం బాధాకరమన్నారు.చేనేత వృత్తి, వస్త్ర పరిశ్రమను బలహీనపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేనేతలతో పాటు ఇతర కులవృత్తులకు జీవం పోస్తుంటే…మరో పక్క కేంద్ర ప్రభుత్వం నూతన విధానాలు ప్రవేశపెట్టి కులవృత్తులను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. చేనేతల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కారు త్రిప్ట్ పథకం, చేనేత బీమా తదితర పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలిచిందన్నారు. కేంద్రంలో మోదీ సర్కారు మెడలు వంచి పెంచిన జీఎస్టీని రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘాలు, పద్మశాలీ, నీలకంఠ కుల సంఘం నాయకులు బూర మల్లేశం, బోడ శ్రీనివాస్, బంగారయ్య, రమేశ్, సత్యానందం, చందు, టీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, బక్కి వెంకటయ్య, మల్లారెడ్డి, రాజు, కిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.