
నీటిని చూస్తే ఎవరికైనా సంబురమనిపిస్తుంది… అలాంటి నీటితో కళకళలాడుతూ చుట్టూ ఏర్పాటు చేసిన కట్ట, దానిపై ఉన్న పచ్చని చెట్ల అందాలు.. ఆ అందాలను ఆకట్టుకునే విదేశీ అతిథులుగా వచ్చే పక్షులు. వీటన్నింటితో అక్కడ సుందర దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. ఇదెక్కడో కాదు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద. ఈ పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం చెరువు కట్టను విస్తరించి బెంచీలు, వాకింగ్ ట్రాక్, వ్యాయామం చేసుకునేందుకు యంత్రాలు ఏర్పాటు చేయడంతో పాటు కట్టను ఆనుకుని ఆలయం నిర్మించడంతో ప్రస్తుతం పెద్ద చెరువు పర్యాటకులతో నిండిపోతున్నది. సెలవు రోజుల్లో ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వచ్చి ఆహ్లాదం, ఆనందంగా గడుపుతున్నారు.
ఆహ్లాదకర ప్రాంతం..
అమీన్పూర్ పెద్ద చెరువు పరిసరాల్లో ఇక్కడి ప్రజలకు సేద తీరుతున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతమంతా సందడిగా మారుతుంది. చెరువు కట్టపై ప్రజలు పెద్దఎత్తున వచ్చి వాకింగ్, వ్యాయామం చేసుకుంటారు. సుమారు మూడు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కట్టపై వాకర్స్‌కు అనువుగా మారింది. ప్రశాంత వాతావరణంలో ఉండే ఈ ప్రాంతంలో వ్యాయామ సామగ్రి ఏర్పాటు చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశ్రాంతి తీసుకునేందుకు సిమెంట్ కుర్చీలు ఏర్పాటు చేశారు. కట్టకు ఇరువైపులా పచ్చని మొక్కలు పెంచడంతో ప్రస్తుతం చెట్లుగా మారి ఆకట్టుకుంటున్నాయి. ఈ చెరువులో తిరుగుతున్న వివిధ రకాల పక్షులు, చేపలను చూస్తూ పర్యాటకులు సంబురపడుతుంటారు. కట్ట ప్రారంభంలో సాయిబాబ దేవాలయం, మధ్యలో పోచమ్మ ఆలయం, బతుకమ్మ ఘాట్‌ను ఏర్పాటు చేశారు.