
ఊట్కూర్, డిసెంబర్ 28 : బైక్పై వెళ్తున్న టీఆర్ఎస్ యూత్ కమిటీ నాయకులను అడ్డగించి బీజేపీ నాయకులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటన మంగళవారం సా యంత్రం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం తిప్రాస్పల్లిలో చోటు చేసుకున్నది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. తిప్రాస్పల్లిలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు టీఆర్ఎస్ పార్టీ జెండాను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కావలి సురేశ్, యూత్ కమిటీ అధ్యక్షుడు గున్ముక్ల రాజు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై విచారించేందుకు గ్రామానికి చెందిన కొందరు యువకులను ఊట్కూర్ పోలీస్ స్టేషన్కు పోలీసులు పిలిపించారు. ఈ విషయమై పోలీసులతో మాట్లాడేందుకు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో బైక్పై స్టేషన్కు వెళ్తున్న టీఆర్ఎస్ యూత్ కమిటీ నాయకులు వడ్ల శ్రీకాంత్, కావలి రవిపై ఇదే గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఆంజనేయులు, ఊషప్పతోపాటు మరికొందరు దాడికి దిగారు. వారు వెళ్తున్న బైక్ను అడ్డగించి ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు. ఘటనలో శ్రీకాంత్, రవి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఇరువర్గాల వారు పరస్పర దాడులకు పాల్పడుతుండగా ఎస్సై పర్వతాలు నేతృత్వంలో పోలీసులు హుటాహుటిన చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. గాయపడిన వారికి చికిత్స కోసం జిల్లా దవాఖానకు తరలించారు. ఘటనపై రెండు వర్గాల వారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. టీఆర్ఎస్ నాయకులను జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, సర్పంచ్ సుమంగళ, ఎంపీటీసీ రవి పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.