భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 16 : అనుమానంతో భార్యను హతమార్చిన భర్తతోపాటు సహకరించిన మృతురాలి తల్లి, చిన్నానను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ కే. నారాయణరెడ్డి తెలిపారు. గురువారం డీసీపీ కార్యాలయంలో పట్టణ సీఐ సుధాకర్‌తో కలిసి విలేకరులకు కేసు వివరాలను ఆయన వెల్లడించారు. హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన కోట దశరథకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కూతురు హేమలతను భువనగిరి పట్టణంలోని తాతానగర్‌కు చెందిన అతడి భావమరిది దేశగాని చంద్రశేఖర్‌కు ఇచ్చి వివాహం చేశాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు. భార్య హేమలతపై అనుమానం పెంచుకున్న భర్త చంద్రశేఖర్ పలు మార్లు మందలించాడు. ఈ నెల 13న హేమలతను కాళ్లు చేతులు కట్టేసిన భర్త చంద్రశేఖర్, తల్లి కోట వెంకటమ్మ, చిన్నాన వెంట్రుక రవి ఆమెతో బలవంతంగా పురుగుల మందు తాగించి తాడు గొంతుకు బిగించి కిరాతకంగా హత్య చేసి పరాపై యాదగిరిగుట్ట పరిసరాల్లో తలదాచుకున్నారు. మృతురాలి తండ్రి దశరథ హేమలత మృతిపై అనుమానం వచ్చి భార్య వెంకటమ్మను నిలదీయగా పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పట్టణ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. హేమలత అంత్యక్రియలు పూర్తయ్యాని నిర్ధారించుకుని తాతానగర్‌కు వచ్చిన నిందితులను విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 15న సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.