భద్రాచలం, జనవరి 2 : భక్తకోటి ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. భద్రాద్రి దివ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే అధ్యయనోత్సవాలు జనవరి 23వరకు కొనసాగుతాయి. ఇప్పటికే భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేటి నుంచి జనవరి 13వరకు పగల్ పత్తు (పగలు నిర్వహించే ఉత్సవాలు), 13నుంచి 23వరకు రాపత్తు ఉత్సవాలు (రాత్రి వేళ నిర్వహించే ఉత్సవాలు), 24 నుంచి 26వరకు విలాసోత్సవాలు జరుపనున్నారు. జనవరి 29న విశ్వరూప సేవ (సకల దేవతల పూజ) నిర్వహిస్తారు. ఉదయం అంతరాలయంలో మూలమూర్తులు, బేడా మండపంలో ఉత్సవ పెరుమాళ్లకు విశేష స్నపనం జరుపుతారు. 10:30 గంటలకు స్వామివారికి మాధ్యహ్నిక ఆరాధన అంతరాలయంలో జరుపుతారు. అనంతరం దేవస్థానం ఈవో చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. అధ్యయనోత్సవాల్లో స్వామివారిని ప్రతిరోజు అందంగా అలంకరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతారు. ఆస్థాన స్థానాచార్యుల వారికి పరివట్టం కట్టి, పుష్పామాలంకృతున్ని చేసి, పంచ శఠారి ఇస్తారు. ఖండ చక్కెర, జీడిపప్పు, కిస్మిస్ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. రోజుకు రెండు వందల పాశురాలు ఆస్థాన స్థానాచార్యుల నేతృత్వంలో పఠిస్తారు. అనంతరం స్వామివారిని గోదావరి తీరం వద్దకు తీసుకు వెళ్లి గోదావరి మాతను దర్శించి, అనంతరం మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు మేళతాళాలు, మంగళవాయిద్యాల, కోలాటల నడము తీసుకు వస్తారు. మిథిలా స్టేడియంలో 2:30 గంటల నుంచి 3: 30గంటల వరకు రామయ్య తండ్రి మత్స్యావతారంలో భక్తులను అనుగ్రహిస్తారు. అనంతరం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. సేవలో భాగంగా స్వామివారిని విశ్రాంత మండపంలో ఉంచుతారు. అక్కడ నుంచి తాతగుడి సెంటర్లో గోవిందరాజ స్వామివారి ప్రాంగణంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ పదిరోజులు స్వామివారికి తిరువీధి సేవ జరుపుతారు.
నేటి కార్యక్రమాలు మిథిలా స్టేడియంలో మధ్యాహ్నం 2నుంచి 4:30 గంటల వరకు హరికథా కాలక్షేపం, సాయంత్రం 6నుంచి రాత్రి 10గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.