
సిటీబ్యూరో, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): ఉస్మానియా, జేఎన్టీయూ వంటి అన్ని యూనివర్సిటీల్లో బీటెక్, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం కావడంతో ర్యాగింగ్ నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు. ర్యాగింగ్‌తో ఎవరూ మానసికంగా కుంగిపోకుండా, సీనియర్ల బారి నుంచి జూనియర్లను రక్షించడం కోసం యూనివర్సిటీలు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా యూనివర్సిటీల్లో కొత్తగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. తరగతులు, కాలేజీల వారీగా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు లు రూపొందిస్తున్నారు. వాటిలో వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇలా.. హాస్టల్ నిర్వహణ అధికారులతో కలిపి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారి నుంచి వెంటనే రక్షణ పొందడానికి వాట్సాప్ గ్రూపులో ర్యాగింగ్ చేస్తున్న వారి వివరాలు, ప్లేస్ వంటివి షేర్ చేయాలి. దీనికి సంబంధిత అధికారులు వెంటనే స్పందించడంతోపాటు ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
టోల్‌ఫ్రీ నంబర్లు..
ర్యాగింగ్ నియంత్రణలో భాగంగా యూనివర్సిటీల్లో టోల్‌ఫ్రీ నంబర్లు, హెల్ప్‌లైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులందరికీ అధికారుల ఫోన్ నంబర్లు ఇవ్వనున్నారు. ర్యాగింగ్ నియంత్రణ కోసం విద్యార్థులు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో చదువుకునే వారితోపాటు ప్రైవేటు అఫిలియేటెడ్ కాలేజీల్లో కూడా ర్యాగింగ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ప్రతి కాలేజీ క్యాంపస్‌లో యాంటీ ర్యాగింగ్ బోర్డులు, స్లోగన్లు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాగింగ్ చేయడంతో ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయి? జూనియర్ విద్యార్థులు ఎన్ని రకాల మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి? సీనియర్లు, జూనియర్లు కలిసి మెలిసి ఏ విధంగా ఉండాలి? దాంతో కలిగే లాభాలు.. వంటి అన్ని కోణాల్లో ఆలోచన చేసేలా సెమినార్లు నిర్వహించనున్నారు.
హద్దుమీరితే..
ఇంత చేసినప్పటికీ సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి కాలేజీలు సిద్ధంగా ఉన్నాయని, ఈ విషయంలో యూనివర్సిటీలు, ప్రభు త్వం కూడా చాలా సీరియస్‌గా ఉ న్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మం డలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబా ద్రి తెలిపారు. అన్ని యూనివర్సిటీల్లో ర్యాగింగ్ లేకుండా, స్నేహపూర్వక వాతావరణంలో కాలేజీ చదువులు కొనసాగడానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. కేవలం కాలేజీ ఆవరణలోనే కాకుండా హాస్టళ్లలో కూడా ర్యాగింగ్ చేయవద్దని సీనియర్ విద్యార్థులను వీసీ హెచ్చరించారు.