శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం జిల్లావ్యాప్తంగా సీతారాముల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ఊరూరా వేడుకలను వైభవంగా నిర్వహించగా.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాములోరి కల్యాణాన్ని కనులారా తిలకించి పులకించిపోయారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెళ్లి వేడుకకు పట్టువస్ర్తాలు, తలంబ్రాలు అందజేశారు. వేదపండితులు కల్యాణ తంతును శాస్ర్తోక్తంగా గావించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో మహా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రామనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి.
నర్సంపేట/వర్ధన్నపేట/నర్సంపేట రూరల్, ఏప్రిల్ 10: నర్సంపేటలోని వాడవాడలా, ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ వేడుకలు కనులపండువగా జరిగాయి. నర్సంపేట పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం, రెడ్డి ఫంక్షన్ హాల్, సిటిజన్ ఫంక్షన్ హాల్, 11వ వార్డు, కనుకదుర్గా ఆలయం, వాసవీ కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. అలాగే, చెన్నారావుపేట మండలంలోని చెన్నారావుపేట, లింగాపురం, ఖాదర్‌పేట, కోనాపురంలో వేడుకలు జరిగాయి. సర్పంచ్‌లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, వెల్ది సుజాత పాల్గొన్నారు. కోనాపురంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ నాయకుడు కంది కృష్ణచైతన్యారెడ్డి పాల్గొన్నారు. లింగాపురంలో భద్రాచలం వాస్తవ్యుడు పైతర్ రాజేంద్రప్రసాద్ భద్రాచలం నుంచి ముత్యాల తలంబ్రాలు అందించారు. వర్ధన్నపేటలోని సీతారామచంద్రస్వామి, ఇల్లంద, కట్య్రాల, చెన్నారం, ఉప్పరపల్లి, ల్యాబర్తిలోని ఆలయాల్లో పండితులు సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు జరిగాయి. పలు గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. ముగ్ధుంపురం, గురిజాల, గుంటూరుపల్లి, లక్నేపల్లి, రామవరం, భోజ్యానాయక్‌తండా, ముత్తోజిపేట, ఇటుకాలపల్లి, రాజపల్లి, మాదన్నపేట, కమ్మపల్లిలో సర్పంచ్‌లు పెండ్యాల జ్యోతి, గొడిశాల మమత, కర్నాటి పార్వతమ్మ, గొడిశాల రాంబాబు, కొడారి రవన్న, భూక్యా లలితా వీరూనాయక్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, మండల రవీందర్, నామాల భాగ్యమ్మ, మొలుగూరి చంద్రమౌళి, వల్గుబెల్లి రంగారెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు అందించారు. ద్వారకపేట శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం గ్రామాల్లో సీతారాముల విగ్రహాలను ఊరేగించారు.
ఖానాపురం/గీసుగొండ/సంగెం: ఖానాపురంలోని సీతారామచంద్రస్వామి, బుధరావుపేట వేంకటేశ్వరాలయం, అశోక్‌నగర్, రంగాపురం కోదండరామాలయాలు, ధర్మారావుపేట ఆంజనేయస్వామి, రాగంపేట ఆంజనేయస్వామి, కొత్తూరు దుర్గామల్లేశ్వరస్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులవిందుగా నిర్వహించారు. పలు ఆలయాల్లో భక్తులకు అన్నదానం చేశారు. ఖానాపురం సీతారామచ్రందస్వామి ఆలయంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నిమ్మగడ్డ శ్రీనివాసరావు, గోనుగుంట్ల పెద్దారావు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, ఆర్బీఎస్ తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్‌రావు, అన్నం ప్రసాద్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గీసుగొండతోపాటు మండలంలోని కోనాయామాకుల, విశ్వనాథపురం, ధర్మారం, కొమ్మాల, ఎలుకుర్తి, మొగిలిచెర్ల, శాయంపేట, ఊకల్ జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకను తిలకించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సంగెం మండలంలోని ఆలయాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు కల్యాణాన్ని తిలకించేందుకు చలువ పందిళ్లు, టెంట్లు వేసి, తాగునీటి వసతి కల్పించారు. సీతారామచంద్రుల ఉత్సవ విగ్రహాలను డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా కల్యాణ మండపాలకు తీసుకెళ్లారు. అమ్మ వారి తరఫున, స్వామి వారి తరఫున పెండ్లి పెద్దలుగా వ్యవహరించి కల్యాణం చేశారు. అనంతరం మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నెక్కొండ/రాయపర్తి/పర్వతగిరి/నల్లబెల్లి/దుగ్గొండి: నెక్కొండలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, సర్పంచ్ సొంటిరెడ్డి యమునా రంజిత్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాక లచ్చులు-రాధ, ఈదునూరి మౌనిక-రమేశ్ దంపతులు కల్యాణాన్ని నిర్వహించారు. అర్చకుడు బీవీఎన్శాస్త్రి, డింగిరి శేషపవన్కుమార్, బూరుగుపల్లి శ్రవణ్శాస్త్రి కల్యాణోత్సవ క్రతువును జరిపించగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సొసైటీ చైర్మన్ మారం రాము, సెకండ్ అడిషనల్ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్దుల్నబీ, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే, నెక్కొండలోని ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, గన్ను బ్రదర్స్ ఆధ్వర్యంలో, గుండ్రపల్లి శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయంలో, పెద్దకోర్పోలు, అలంకానిపేట, పత్తిపాక, బొల్లికొండలో సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. రాయపర్తి మండలంలోని 39 గ్రామాల పరిధిలోని ఆలయాలతోపాటు ప్రధాన కూడళ్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తుల నేతృత్వంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి పరిణయ ఘట్టాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
మండలకేంద్రంలోని వరదరాజ వేణుగోపాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో లక్ష్మణ, సీతా సమేత రాములోరికి గ్రామస్తుల సహకారంతో ఆలయ అనువంశిక పూజారులు ఆరుట్ల రంగాచార్యులు, వెంకట రామకృష్ణమాచార్యులు, వెంకటరమణాచార్యుల సారథ్యంలో ఘనంగా వేడుక జరిపించారు. కల్యాణోత్సవానికి సర్పంచ్ గారె నర్సయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించగా, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్, సీఐ జీ సదన్‌కుమార్, ఎస్సై బండారి రాజు, ఎంపీటీసీలు అయిత రాంచందర్, బిల్లా రాధికా సుభాష్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే, మండలంలోని కొత్తూరు, పెర్కవేడు, కొండాపురం, ఊకల్, మైలారం, జగన్నాథపల్లి, సన్నూరు, వెంకటేశ్వరపల్లి, కిష్టాపురం, కాట్రపల్లి, కొండూరు, తిర్మలాయపల్లి తదితర గ్రామాల్లో రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది.
కాగా, మైలారంలో అయ్యప్ప సేవా సమితి ప్రతినిధుల సారథ్యంలో సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించగా, మండలంలోని పన్యానాయక్తండాకు చెందిన దయన్న యువసేన వ్యవస్థాపకుడు బదావత్ వీరన్న అన్నదాన కార్యక్రమానికి పెరుగు బకెట్లను అందజేసి తమ భక్తిని చాటారు. పర్వతగిరి మండలం ఏనుగల్ ధన్మెట్టుగుట్ట వద్ద, కొంకపాక అభయాంజనేయస్వామి, జమాల్‌పురం హనుమాన్ ఆలయం, పర్వతగిరి, చౌటపెల్లి, అన్నారం షరీఫ్, చింతనెక్కొండ, వడ్లకొండ, కల్లెడ, బూరుగుమళ్లలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. నల్లబెల్లితోపాటు మండలవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. మామిండ్లవీరయ్యపల్లెలో సర్పంచ్ ఊరటి అమరేందర్‌రెడ్డి తమ ఇంటిలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యే క పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయానికి తరలించి కల్యాణం జరిపించారు. మండలకేంద్రంలోని రామాలయంలో నీల శ్రీనివాస్ సీతారాములకు పట్టువస్ర్తాలు సమర్పించారు. రుద్రగూడెంలో వైస్ ఎంపీపీ గందె శ్రీలతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. దుగ్గొండి మండలంలోని కేశవాపురం వేంకటేశ్వరాలయం, నాచినపల్లి సీతరామచంద్రస్వా మి ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో, రేఖంపల్లి, తొగర్రాయి, లక్ష్మీపురం, మదిర, మహ్మదాపురం, తిమ్మంపేట, దుగ్గొండి, మల్లంపల్లి, మర్రిపల్లి, ముద్దునూరు, చలపర్తి, దుగ్గొండిలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో తారాముల కల్యాణాన్ని జరిపించారు.
నెక్కొండ/దుగ్గొండి, ఏప్రిల్ 10: పరిపాలన దక్షుడిగా, ప్రజా సేవకుడిగా, ధర్మరక్షకుడిగా జీవనపర్యంతం ఉన్నత నైతిక విలువలతో జనరంజక పాలన అందించి రామరాజ్యన్ని స్థాపించిన శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శప్రాయుడని, రాముడు చూపిన దారిలో పయనించి ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్ది పిలుపునిచ్చారు. నెక్కొండ రామాయలం, బొల్లికొండగుట్టపై ఆదివారం నిర్వహించిన శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అలాగే, దుగ్గొండి మండలంలోని నాచినపల్లి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పెద్ది పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.