యాదాది, డిసెంబర్20 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. బాలాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వేదమంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు జరిపించారు. ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు. శ్రీరంగనాయకుడిపై గోదాదేవి రచించిన పాశురాలను పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు నిర్వహించారు. యాదాద్రీశుడికి పంచామృతాలతో అభిషేకించి, పట్టువస్ర్తాలను ధరింపజేసి, అర్చన చేశారు. మండపంలో ఉత్సవ మూర్తులను తులసీదళాలతో అర్చించారు. సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం వేడుకలను చేపట్టారు. సాయంత్రం బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక సేవ నిర్వహించారు. సత్యనారాయణ స్వామి పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
శివుడికి రుద్రాభిషేకం..
పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి బాలాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చనను వైభవంగా జరిపారు. ఉదయాన్నే శివుడిని ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడికి విభూతితో ఆలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహా గణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలను అభిషేకించి అర్చన చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి ఖజానాకు సోమవారం రూ. 11,80,785 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా
వీఐపీ దర్శనాలు 1,23,600
రూ.100 దర్శనం టిక్కెట్ 11,000
వేద ఆశీర్వచనం 3,600
సుప్రభాతం 1,200
క్యారీబ్యాగుల విక్రయం 6,600
వ్రత పూజలు 56,000
కల్యాణకట్ట టిక్కెట్లు 21,600
ప్రసాద విక్రయం 5,47,000
వాహన పూజలు 13,100
టోల్గేట్ 1,400
అన్నదాన విరాళం 13,865
సువర్ణ పుష్పార్చన 1,15,000
యాదరుషి నిలయం 41,400
పాతగుట్ట నుంచి 25,820
ఇతర విభాగాలు 9,999