యాదాద్రి, డిసెంబర్18 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ధనుర్మాసం సందర్భంగా అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు. గోదాదేవి రచించిన పాశురాలను పఠించారు. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు చేశారు. ఉదయం 3గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8గంటలకు సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. అష్టోత్తర పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ. 13,15,987 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
క్యూ కాంప్లెక్స్‌కు ద్వారాల బిగింపు పనులు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు వెళ్లేందుకు నిర్మించిన క్యూ కాంప్లెక్స్‌లో ద్వారాల బిగింపు పనులు వైటీడీఏ అధికారులు చేపడుతున్నారు. వీటితో పాటు ఎగ్జిట్ ఫ్లై ఓవర్ వెడల్పు పనుల్లో అధికారులు వేగం పెంచారు.ద్వితీయ ఘాట్ రోడ్డుకు అనుసంధానం చేసే పనులు సాగుతున్నాయి. యాదాద్రి కొండపై స్వాగత తోరణాల పనులు చకచకా సాగుతున్నాయి. కొండపై నిర్మించే ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని చదును చేశారు.
నిజాయితీ చాటుకున్న హోంగార్డులకు ప్రశంసాపత్రాలు
ఈ నెల 15న యాదాద్రి నరసింహుడి దర్శనానికి వచ్చి పోగొట్టుకున్న బంగారాన్ని హోంగార్డులు రవి, మమత భక్తులకు అందించి నిజాయితీ చాటుకున్నారు. వారిని ఆలయ ఈఓ ఎన్.గీత అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు.