
భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న రేజింతల్ సిద్ధివినాయకుడు జయంత్యుత్సవాలకు ముస్తాబయ్యాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్లో స్వయంభూగా వెలిసిన విఘ్నేశ్వరుడు మహిమాన్వితుడు. దక్షిణ ముఖ సింధూర వర్ణంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. సిద్ధివినాయకుడి 222వ జయంత్యుత్సవాలను కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నేటినుంచి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. కొవిడ్ నిబంధనలతో ఉత్సవాలు నిర్వహిస్తామని, మాస్క్ ఉంటేనే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ కమిటీ ప్రకటించింది. భక్తులు నిబంధనలు పాటిస్తూ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని
సూచించింది.
న్యాల్కల్, జనవరి 2: ముప్పైమూడు కోట్ల దేవతల్లో ఒకడైనవాడు. విఘ్నాలను నివారించి తలచిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరిపించే సింధూర వదనుడైన రేజింతల్ స్వయంభూ సిద్ధివినాయక స్వామి 222వ జయంత్యుత్సవాలకు ఆలయం ముస్తాబయ్యింది. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నేటి నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు.
స్వయంభువుడై వెలిశాడిలా..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ జాతీయ రహదారికి కిలో మీటర్ దూరంలోని రేజింతల్ గ్రామ శివారులో సిద్ధివినాయక స్వామివారి ఆల యం ఉన్నది. స్థల పురాణం ప్రకారం.. దాదాపు 222 సంవత్సరాల క్రితం శివరాంభట్ యోగి శిష్యులతో కలిసి కాలినడక పాదయాత్రతో తిరుపతికి వెళ్తుండగా, రాత్రి కావడంతో స్వామివారి ఆలయం ప్రాంతం దట్టమైన కీకారణ్యంగా ఉండడంతో అక్కడే బసచేశారు. శివరాంభట్ యోగి ఈ ప్రాంతంలో ఉండడంతో ఆయనకు అపరిమితమైన మానసిక ప్రశాంతత లభించిందట. దీంతో ఆయన కొంతకాలం పాటు ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటుండగా, వినాయక స్వామి తన ఉనికి తెలియజేసి పూజలను నిర్వహించమని ఆదేశించాడట. పుష్యమాస చవితి రోజున శివరాంభట్ తపస్సులో ఉన్న సమయంలో వినాయకుడు చెప్పిన సూచనలను శిష్యులకు పూజలు చేయమని చెప్పడంతో, వెతుక్కుంటూ వెళ్లిన శిష్యులకు స్వయంభువుడిగా వెలసిన సిద్ధివినాయక స్వామివారు దర్శనమిచ్చాడు. వెంటనే ఈ విషయాన్ని శిష్యులు శివరాంభట్ యోగికి తెలపడంతో అక్కడికి చేరుకొని మొదటిసారిగా పూజలు చేసి, స్వామివారి విశిష్టతను ప్రపంచానికి తెలియజేశారు. అప్పటి నుంచి రేజింతల్ సిద్ధివినాయకుడు భక్తాభీష్ట వరదాయకుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
ఉత్సవ వివరాలు..
సిద్ధివినాయక స్వామి వారి 222వ జయంతోత్సవాలను ఆలయంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణం, యాగశాల తదితర వాటిని పచ్చని తోరణాలతో అందంగా అలకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు తాగునీరు, వసతి, అన్నదానం తదితర సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు. సోమవారం (నేడు)ఆలయంలో వేదఘోషం, దీపప్రజ్వలన, ధ్వజారోహణ, పుణ్యహవచనం స్వామివారికి అభిషేకం, దేవతా ఆహ్వానం, హారతి, తీర్థ ప్రసాద వితరణ, 4, 5 తేదీల్లో స్వామివారికి అభిషేకం, గణపతి హవనమాలు, శతచండీ హవనమం, మహా మంగళహారతి, 6న స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం సమాప్తి, పూర్ణాహుతి, మహా నైవేద్యం, తీర్థ ప్రసాద వితరణ, అన్నదానం, 7న ఉదయం స్వామివారికి అభిషేకం, 9 గంటలకు సిద్ధి, బుద్ధి సమేత సిద్ధివినాయక స్వామి కల్యాణోత్సవం, మహామంగళ హారతి, తీర్థప్రసాద వితరణ, అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రేజింతల్ సంగయ్య, అల్లాడి నర్సిములు తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్లు ఉంటేనే దర్శనానికి అనుమతి ఉంటుందని సూచించారు.
ఆలయ ప్రత్యేకతలు..
రాష్ట్రంలోనే స్వయంభువుడిగా దక్షిణ వైపు ముఖంగా వెలిసిన సిద్ధివినాయక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గర్భాలయంలో వినాయకుడిపై ఛత్రం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. వెనుక వైపు సువర్ణ మకర తోరణంగా గోచరిస్తుంది. స్వామివారి దిగువన రజక మకర తోరణంలో సూక్ష్మ వినాయకుడి ప్రతిమ ఉంటుంది. స్వామివారికి సింధూర వర్ణంతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. నాటి నుంచి నేటి వరకు ఆలయంలో సిద్ధివినాయక విగ్రహం ఏటేటా పెరుగుతుందని భక్తుల నమ్మకం. సకల విఘ్నాలూ సమస్త క్లేశా ల్నీ నివారించే ఆపన్న వరదుడిగా రేజింతల్ సిద్ధివినాయకుడికి ప్రత్యేకమైన పేరున్నది. ప్రతినెలా వచ్చే సంకట చతుర్ధి రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళవారం వచ్చే అంగరక సంకష్టహర చతుర్ధి రోజున కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తజనంతో ఆల య ప్రాంతం కిటకిటలాడుతుంది.