
జిన్నారం, జనవరి 3 : ‘కాలుష్య సమస్య కట్టడి కాకపోవడానికి కారణం పీసీబీ అధికారులే. అధికారులు జిన్నారం మండలంలో స్థానికంగా ఉంటే కాలుష్య సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్త్తుంది. ఈ ప్రాంతం అభివృద్ధి కాకపోవడానికి అధికారులే కారణం. జీతం తీసుకుంటున్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలి’ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మండల సభలో ఏఈ భాగ్యలక్ష్మి గడ్డపోతారం వీవీన్ డ్రగ్స్ పరిశ్రమ విజిట్‌పై కాలుష్య కమిటీ తీసుకున్న చర్యల గురించి వివరించారు. రాయుని చెరువుపై ఉన్న పరిశ్రమలతో చెరువు పూర్తిగా కాలుష్యం బారిన పడుతున్నదని ఎంపీటీసీ వెంకటేశంగౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నా రు. ‘పరిశ్రమలో వారికి వాటా ఉన్నదని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని వావిలాల పీఏసీఎస్ చైర్మన్ శేరికారి శంకర్‌రెడ్డి అన్నారు. దీనిపై పీసీబీ ఏఈ అలా మాట్లాడడం కరెక్ట్ కాదని, మర్యాదగా మాట్లాడాలన్నారు. ఎంపీపీ రవీందర్‌గౌడ్ అధ్యక్షతన సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలుష్య సమస్యపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘డబ్బు, ఎనబై దశకంలో పరిశ్రమలు వస్తున్నాయని సంతోషించాం. కానీ వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. పరిశ్రమలను వద్దనలేం. పరిశ్రమల నుంచి కాలుష్యం రాకుండా ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకొని పరిశ్రమలను రన్ చేసేలా పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఖాజీపల్లి జిల్లెలవాగు, బొల్లారంలోని ఆసానికుంట, పటాన్చెరు నక్కవాగు గురించి ఇంగ్లిష్ పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయన్నారు. ఆసానికుంటను అప్పటి గవర్నర్ రంగరాజన్ పరిశీలించి విస్తుపోయినట్లు చెప్పారు. వీటికి సంబంధించి వార్త కథనాల క్లిప్పింగ్స్ నా వద్ద ఉన్నాయాన్నారు. ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రజలు వింత రోగాలకు గురవుతున్నారని తెలిపారు. పీసీబీ అధికారులు సరిగ్గా పని చేస్తే ప్రజల సమస్య తీరుతుందన్నారు. కార్మికులు, ప్రజల కోసం పటాన్చెరులో రూ.200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరైందన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ దవాఖానకు శంకుస్థాపన చేస్తారన్నారు. అంతకుముందు సభ్యులు సభలో ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. శివానగర్ ఉప్పరివాని కుంటలో వేసిన రోడ్లను తొలగించాలని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సోలక్పల్లిలో మెగా ప్లాంటేషన్ కోసం ఐదెఎకరాల స్థలం కేటాయించాలని సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యేను కోరగా స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీడీవో రాము లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.