
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకూ టెంపరేచర్ పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. మంగళవారం అత్యల్ప ఉష్ణోగ్రతలు 15-18 డిగ్రీల సెల్సియస్ నమోదైనప్పటికీ పొగమంచు వీడడం లేదు. ఏజెన్సీలోని గూడేలు, తండాలు, పల్లెల్లో ఉదయం పది గంటల వరకు కూడా పొగమంచు కమ్మేయడంతో బయటకు వెళ్లాలంటే గిరిజనులు వణుకుతున్నారు. వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. పొలం పనులకు వెళ్లేవారు టార్చీలైట్స్ తీసుకొని వెళ్తున్నారు.
బోథ్/ఉట్నూర్/బజార్హత్నూర్/ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, డిసెంబర్ 28 :అడవుల ఖిల్లా ఆదిలాబాద్లో వర్షం, చలి తీవ్రత ఎక్కువే. ఈ ప్రాంతం చలికాలంలో ఉదయం పూట ఎదుటి మనిషి కనిపించనంత పొగమంచుతో కశ్మీరంలా దర్శనమిస్తున్నది. రోడ్లపై వెళ్లే వాహనాలు రాత్రివేళల్లో మాదిరి లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, బోథ్, బజార్హత్నూర్ మండలాలు మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచుతో నిండిపోయాయి. ఉదయం 9 గంటలు దాటినా మంచు కురుస్తూనే ఉంది. ఇళ్లు, రోడ్లు, ఎదురెదురుగా మనుషులు, వాహనాలు తారసపడినా కనిపించనంతగా వ్యాపించింది. రెండు రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పుల మూలంగా ఆకాశం మేఘావృతమై పొగమంచు వ్యాపిస్తున్నదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క రైతులు ఆ పొగమంచును సైతం లెక్కచేయకుండానే వ్యవసాయ పనుల్లో బిజీగా కనిపించారు. కాగా.. యాసంగిలో సాగు చేస్తున్న శనగ, ధనియాలు, మక్క, జొన్న పంటలకు పొగ మంచు నష్టం కలిగించే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.