రైతుబంధు డబ్బులు వరుసగా ఐదో రోజూ రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. సోమవారం ఉమ్మడి జిల్లాలో 57,148 మంది రైతులకు రూ.114,37,57,391లను వారి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం వేసింది. కాగా, ఇప్పటి వరకు 7,92,171 మందికి రూ.657,37,33,774ను రైతులు అందుకున్నారు. దీంతో, తమ లాగోడీ కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ పలుచోట్ల ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. బ్యాంకులకు పోయి పైసలు తీసుకుని మురిసిపోయారు. వడ్డీ వ్యాపారుల వద్ద రూపాయి అప్పు లేకుండా ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి ఎవుసం చేసుకుంటామని సంతోషం వ్యక్తం చేశారు. పంట పెట్టుబడి కోసం ఎనిమిది విడతల్లో కలిపి ఈ నెల పదో తేదీ వరకు రైతుల అకౌంట్లలో వేస్తున్న డబ్బు రూ.50వేల కోట్లకు చేరుకుంటున్నందున సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు
సిద్ధమవుతున్నారు.
సిద్దిపేట అర్బన్, జనవరి 3: రైతుబంధు సంబురం ఐదో రోజూ కొనసాగింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎనిమిదో విడత రైతుబంధులో భాగంగా గత నెల 28వ తేదీ నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నది. ఐదో రోజు సోమవారం రైతులకు రైతుబంధు డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేసింది. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని.. రైతులను కండ్లలో పెట్టుకొని చూసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి అని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదో రోజు (సోమవారం) సిద్దిపేట జిల్లాలో 20,905 మంది రైతులకు గానూ రూ.41,95,76,009, మెదక్ జిల్లాలో 11,055 మంది రైతులకు గానూ రూ.20,92,86,134, సంగారెడ్డి జిల్లాలో 25,188 మంది రైతులకు గానూ రూ.51,48,95,248, మొత్తం ఉమ్మడి జిల్లాలో 57,148 మంది రైతులకు రూ.114.37 లను రైతుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. కాగా, ఈ ఐదు రోజుల్లో సిద్దిపేట జిల్లాలో 2,75,314 మంది రైతులకు గానూ రూ.238,37,53,094 మెదక్ జిల్లాలో 2,24,541 రైతులకుగానూ రూ.160,24,45,189, సంగారెడ్డి జిల్లాలో 2,92,316 మంది రైతులకుగానూ రూ. 258,75,35,491, మొత్తం ఉమ్మడి జిల్లాలో 7,92,171 మంది రైతులకుగానూ రూ.657,37,33,774లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
సీఎం సార్ గొప్ప మనుసు..
సీఎం కేపీఆర్ సార్ది గొప్ప మనుసు. రైతులకు రైతుబంధు కింద సాయం అందించి ఆదుకుంటున్న దేవుడు. గతంలో పంట వేసుకుందామంటే వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లి మిత్తికి డబ్బులు తెచ్చుకునేటోళ్లం. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా సీఎం సారే పంటల సాగుకు డబ్బులు బ్యాంకులో వేస్తున్నడు.
అప్పుల బాధ తప్పింది..
సీఎం కేసీఆర్ సార్ మంచోడు. అప్పులు లేకుండా పంటలను వేసుకుంటున్నం. అప్పట్లనైతే వడ్డీ వ్యాపారుల వద్ద పొద్దంతా కుసుండబెట్టుకుని చివరికి డబ్బులు లేవన్నా మరలిపోయేటోళ్లం. మల్ల తెల్లారి వచ్చి కుసుంటే పొద్దికి పైసలు ఇస్తుండే. ఇప్పుడు గవన్నీ లేవు. సీఎం కేసీఆర్ సారే రైతుల కష్టాలను గుర్తించి పైసలు బ్యాంకులో వేస్తున్నడు.
రైతన్న మురిపెం..
ఝరాసంగం, జనవరి3: సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కెనరా బ్యాంకు శాఖలో రైతుబంధు పైసల కోసం సోమవారం రైతులు బారులు తీరారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన రైతుబంధు పథకం తమకెంతగానో అక్కరకు వస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున తమ ఖాతాల్లో జమవుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సార్ సాయంతో అప్పు లేకుండా ఎవుసం చేసుకుంటున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
కాకర పంటకు అక్కరకొచ్చినయ్..
నా పేరు కారింగుల రాంరెడ్డి. మాది సింగాయిపల్లి, వర్గల్ మండలం. సీఎం సారు రైతుబంధు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా వానకాలం, యాసంగి లాగోడికి సావుకారి దగ్గర అప్పులు చేయలె. నాకు నాలుగెకరాలకు రూ.20 వేలు ఖాతాలో పడ్డయి. వచ్చిన ప్రతీ పైసా లాగోడికే పెడుతున్న. నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాల్లో పందిరి వేసిన. మరో రెండో ఎకరాల్లో దుక్కి దున్ని బబ్బెర, చిక్కుడు, టమాట వేసిన. గిప్పుడు కాకర పెడుదామనుకుంటున్న. ఆ పైసలు కాకరకు అక్కరకొస్తున్నయి. సీఎం కేసీఆర్ రైతులపాలిట దేవుడైండు.