
రైతు బంధు పంట పెట్టుబడి సాయం రూ.50వేల కోట్లకు చేరుతున్న తరుణాన యావత్ కర్షకలోకం సంబురాలు జరుపుకొంటున్నది. వాకిళ్లలో రంగవల్లులు కనువిందు చేస్తుండగా.. ఊరూరా సాగుతున్న క్షీరాభిషేకాలు వారోత్సవాలకు కొత్త శోభను తీసుకొస్తున్నాయి. పంట ఉత్పత్తులతో ‘జై కేసీఆర్’, ‘జై రైతు బంధు’ అని రాసి కృతజ్ఞతలు చెబుతున్నారు. గ్రామాల్లో ఎడ్లబండ్లతోర్యాలీలు నిర్వహించి అభిమానాన్ని చాటుకుంటున్నారు. పంట పొలాల్లోనే రైతులు క్షీరాభిషేకాలు నిర్వహిస్తుండడంతో చేను, చెలక మురిసిపోతున్నది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టుబడి సాయం పథకంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆలేరు, భువనగిరిలో జరిగిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి మంత్రి సంబురాల్లో పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగోరోజు సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితోపాటు, పలువురు జిల్లా అధికారులు వేడుకల్లో పాల్గొని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.