కామారెడ్డి టౌన్, డిసెంబర్ 23 : వయోవృద్ధులకు సేవ చేస్తే దేవుడికి చేసినట్లు భావించాలని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజనలో భాగంగా వృద్ధులు, దివ్యాంగులకు సహాయ పరికరాలను అందజేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాతోపాటు తెలంగాణలోని కామారెడ్డిని ఎంపిక చేశారని తెలిపారు. జిల్లాలో 4,549 మందికి పరికరాలు మంజూరయ్యాయని తెలిపారు. రూ. 34.21 లక్షల విలువైన పరికరాలను అందజేశామని చెప్పారు. గ్రామాల్లో అర్హులైన వారు పరికరాల కోసం జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయోవృద్ధుల కమ్యూనిటీ హాలుకు రూ. 5 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాకు పరికరాలు అందేలా ఎంపీ బీబీపాటిల్ కృషిచేశారని కొనియాడారు. లబ్ధిదారులు పరికరాలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి సరస్వతి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజన్న, సీనియర్ సిటిజన్స్ ప్రతినిధి భద్రయ్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు విఠల్‌రావు, అలీమ్ కో- డైరెక్టర్ అరుణ, రీజినల్ డైరెక్టర్ రాజేశ్, సాక్ష్యం రాష్ట్ర డైరెక్టర్ కరుణాకర్, అధికారులు పాల్గొన్నారు.