
మునుగోడు, డిసెంబర్ 28 : పేదరికంతో ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కావద్దనే లక్ష్యంతో ‘కస్తూరి ఫౌండేషన్’ పేరిట కస్తూరి శ్రీచరణ్ ప్రారంభించిన సేవాయజ్ఞం సాగుతున్నది. సర్కారు బడులను తీర్చిదిద్దే లక్ష్యంతో శ్రీచరణ్ 2017 జూన్ 22న కస్తూరి ఫౌండేషన్ను ప్రారంభించారు. నాటి నుంచి రూ.5కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని 150 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులకు మరమ్మతులు చేయించారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల వంటి వసతులు కల్పించారు. విద్యార్థులకు అధునాతన బోధన కోసం ఎల్సీడీ ప్రొజెక్టర్లు, సౌండ్ సిస్టమ్స్ అందించారు. 1.5లక్షల స్టడీ కిట్లు పంపిణీ చేశారు. పదోతరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు నిపుణులతో తయారు చేయించిన స్టడీ మెటీరియళ్లను 20వేల మందికి అందజేశారు.
ఉన్నత విద్యకు అండగా…
లక్ష్మీ కటాక్షం లేని ఎంతోమంది సరస్వతీ పుత్రుల ఉన్నత విద్యకు శ్రీచరణ్ ఆర్థికంగా చేయూతనిచ్చారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ సీట్లు సాధించి ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్న ఐదుగురు గిరిజన విద్యార్థినులకు దీనగాథ వివరిస్తూ ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి వెంటనే స్పందించి ఒక్కో విద్యార్థినికి రూ.20వేల చొప్పున అందించారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది పేద విద్యార్థులకు రూ.20లక్షలు ఆర్థిక సాయం చేశారు. పదోతరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన 60 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంగా రూ.4లక్షలు అందజేశారు.
పర్యావరణ పరిరక్షణలోనూ..
పర్యావరణాన్ని కాలుష్యం బారి నుంచి పరిరక్షించేందుకు కస్తూరి ఫౌండేషన్ విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. గతేడాది వినాయక చవితి సందర్భంగా శ్రీచరణ్ సుమారు 5వేల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచుల దుష్పరిణామాలపై చైతన్యం చేసేందుకు 5వేల జ్యూట్ బ్యాగులను అందించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో విద్యుత్ సౌకర్యం లేని 4 గోండుగూడేల్లోని 45 కుటుంబాలకు రూ.1.5లక్షలతో సోలార్ చార్జింగ్ లైట్లను అందించారు.
శ్రీచరణ్ సార్కు రుణపడి ఉంటాం…
ఎన్ఐటీ కురుక్షేత్రలో ప్రొడక్షన్ అండ్ ఇంజినీరింగ్ సీటు సాధించా. ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడంతో నా చదువు ఆగిపోతుందని ఆందోళన చెందా. నా దీనావస్థను వివరిస్తూ ‘నమస్తే తెలంగాణ’ పేపర్లో కథనాన్ని ప్రచురించగా నాతో పాటు మరో నలుగురికి శ్రీచరణ్ సార్ రూ.20వేల చొప్పున చెల్లించారు. నా చదువుకు సాయపడిన శ్రీచరణ్ సార్కు సదా రుణపడి ఉంటా.
తీర్చిదిద్దడమే లక్ష్యం…
ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక ఏ విద్యార్థీ చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతోనే కస్తూరి ఫౌండేషన్ను స్థాపించాం. సర్కారు బడులను ఆదర్శంగా తీర్చిదిద్దడం మా ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. దీంతో పాటు ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్నాం. కేవలం విద్యారంగానికే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోనూ మా సేవా కార్యక్రమాలను విస్తృతం చేశాం.