బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి కదం తొక్కారు.
బ్యాంకు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు తీశారు. సేవ్ బ్యాంక్స్.. సేవ్ నేషన్ వంటి అనేక ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళనతో అన్ని బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభించిపోయాయి. సమ్మెకు టీఆర్ఎస్ నాయకులు, వామపక్ష కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.
భువనగిరి అర్బన్, డిసెంబర్ 16 : కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి నిర్వీర్యం చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎండీ.ఇమ్రాన్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతునిచ్చి మా ట్లాడారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీతో భాగస్వామ్యం చేస్తూ ఒప్పదం చేయడం సరికాదన్నారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు బ్యాంకు సేవలు దూరమవుతాయన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేశ్, సీపీఐ పట్టణ కార్యదర్శి సామల శోభన్‌బాబు, నాయకులు చొప్పరి సత్తయ్య, బాబు, బస్వయ్య, అంజయ్య, సురేశ్, కృష్ణ, రాజు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
వలిగొండలో…
వలిగొండ : మండల కేంద్రంలో ఎస్బీఐ రెడ్లరేపాక, వలిగొండ బ్యాంకు శాఖల ఉద్యోగులు గురువారం సమ్మె నిర్వహించారు. కార్యక్రమంలో వెంకన్న, వనం రాజు, రాజు, ప్రదీప్, దివ్య, శ్రవణ్, పోషయ్య, నవీన్ పాల్గొన్నారు.