అందోల్/మునిపల్లి/పుల్కల్ రూరల్, అక్టోబర్ 12 : భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిందని సంగారెడ్డి కలెక్టర్ హనమంతరావు అన్నా రు. మంగళవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి అందోల్, మునిపల్లి, పుల్కల్ తహసీల్ కార్యాలయాల్లో భూ రికార్డులను తనిఖీచేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించామన్నారు. పరిష్కారం కానీ (నిషేధిత/ప్రభుత్వ, ఇతర జాబితాలో) చేరిన వాటిని త్వ రలో సరిదిద్దుతామని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. తహసీల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి ధరణి జీఎల్ఎంలో వచ్చిన ఆర్జీలు, భూముల వివరాలు పరిశీలించి, అన్ని సక్రమంగా ఉన్న పట్టా భూముల సమస్యలు అక్కడే పరిష్కరించారు. అనంతరం తహసీల్దార్లతో గ్రామాల వారీగా జరుగుతున్న నిషేధిత జాబితా సవరణ గురించి సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ల పరిధిలో పరిష్కారమయ్యే భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించి రైతులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అందోల్-జోగిపేట ఇన్చార్జి ఆర్డీవో అంబదాస్రాజేశ్వర్, తహసీల్దార్లు అశోక్‌కుమార్, పరమేశం, నాయబ్ తహసీల్దార్ వీరేశం, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.