సంగారెడ్డి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కనిష్ఠ స్థాయికి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలితీవ్రతతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. జిల్లాలోని శుక్రవారం కోహీర్‌లో అతి తక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటీవల కాలంలో కోహీర్‌లో అత్యల్పంగా ఉష్ణోగ్రత నమోదయ్యా యి. వారం రోజులుగా కోహీర్‌లో 6 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమో దైంది. మరి కొద్దిరోజులపాటు చలితీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం కోహీర్‌లో అత్యల్పంగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యధికంగా వట్పల్లిలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జహీరాబాద్ మండలం సత్వార్‌లో 10 డిగ్రీలు, సిర్గాపూర్‌లో 10.9, హత్నూర మండలం గుండ్లమాచునూరులో 11.3 డిగ్రీలు, రామచంద్రాపురంలో 11.7 డిగ్రీలు, నాగల్గిద్దలో 11.8, రామచంద్రాపురంలో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొగుడంపల్లి మండలంలో 12 డిగ్రీలు, మునిపల్లి మండలంలో 12.3 డిగ్రీలు, చౌటకూరులో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొండాపూర్, అందోల్ మండలాల్లో 12.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. హత్నూర, సిర్గాపూర్ మండలాల్లో 12.7 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్చెరు మండలం పాశమైలారంలో 12.8, మనూరులో 12.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. న్యాల్కల్ మండలంలో 13.0, గుమ్మడిదల మండలంలో 13.3, పుల్కల్లో 13.4, మునిపల్లిలో 13.5, కల్హేర్‌లో 13.6, రాయికోడ్‌లో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గుమ్మడిదల మం డలం 14.7, జిన్నారంలో 15.2, నారాయణఖేడ్‌లో 15.2, పటాన్చెరులో 15.3, సంగారెడ్డిలో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. అమీన్పూర్లో 16.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో జనం బయట రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7.30 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటగానే చలి పెరుగుతుంది. చలి నుంచి రక్షించుకునేందుకు స్వెట్టర్లు, క్యాప్ లు, మఫ్లర్లు ధరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. గ్రామీణులు చలిమంటలు వేసుకోవడంతోపాటు తమ పశువులను చలి నుంచి రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.