
‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా’ అంటే అవుననే అంటున్నారు ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులు. దశాబ్దాలుగా ఒకేతీరు పంటలు వేస్తూ దిగుబడి రాక, పెట్టుబడులు సైతం ఎల్లక అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు.. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఇతర పంటలు, లాభదాయ సాగుపై అవగాహన కల్పిస్తుండడంతో ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన రైతు కొంక లక్ష్మీనారాయణ ఇలాగే ఆలోచించి ఎర్రచందనం మొక్కల పెంపకానికి ముందుకు వచ్చాడు. తనకున్న ఎకరం పొలంలో రూ. 4లక్షల పెట్టుబడితో 650 ఎర్రచందనం మొక్కలను విజయవాడ నుంచి తెచ్చి నాటాడు. పూర్తిగా సేంద్రియ విధానంలో డ్రిప్ పద్ధతితో నీటిని అందిస్తూ, ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నాడు. మొదటి రెండేండ్లు కష్టపడితే తర్వాత పెద్దగా పని ఉండదని, కానీ..చివర్లో ఆదాయం మాత్రం రూ. కోట్లల్లో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
కొమురవెల్లి, జనవరి 9 : ‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా’ అంటూ పలు సందర్భాల్లో మనం ఇతరులతో అని కాసేపు నవ్వుకుంటాం. కానీ, ఇప్పుడు అదే నిజమవుతున్నది. కలప జాతి వృక్షాలు కాసులు కురిపిస్తున్నాయి. సహజంగా ఎర్రచందనం అనగానే చాలామందికి శేషాచల అడవులు, కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లోని అడవులు గుర్తుకు వస్తాయి. ఇకపై ఎర్రచందనం చూడాలంటే అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి వెళ్తే ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్లు చూపరులను కనువిందు చేస్తున్నాయి. కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన రైతు కొంక లక్ష్మీనారాయణకు వచ్చిన విన్నూత ఆలోచనతో ధైర్యం చేసి ఎర్రచందనం మొక్కలు పెంచుతున్నాడు. రూ.4లక్షలు పెట్టి విజయవాడ నుంచి 650 ఎర్రచందనం మొక్కలు తెచ్చి తనకున్న ఎకరం పొలంలో పెంచుతున్నాడు. ఎప్పటికీ ఒకే రకమైన పంటలను సాగుచేయకుండా ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని ప్రభుత్వం వ్యవసాయాధికారులతో గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నది. కానీ, చాలామంది రైతులు ఎప్పుడూ ఒకే పంటను వేస్తున్నారు. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడం లేదు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసే మంచి ఆదాయం పొందవచ్చు,
సేంద్రియ పద్ధ్దతుల్లో పెంపకం…
ప్రారంభంలో రూ. 4లక్షలు పెట్టి యువ రైతు లక్ష్మీనారాయణ ఎర్రచందనం మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. సేంద్రియ ఎరువులైన మేకలు, పశువుల ఎరువులు ప్రతి 6 నెలలకోసారి చెట్ల మొదళ్లలో వేస్తున్నాడు. చెట్ల మొదట్లో గడ్డి లేకుండా చూసుకుంటూ చెట్లకు పెరిగిన పక్క కొమ్మలను కటింగ్ చేస్తూ వాటిని సంరక్షిస్తున్నాడు. ఎలాంటి పెట్టుబడి లేకుండా డ్రిప్ ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నాడు. ఐదేండ్ల క్రితం 650 ఎర్రచందనం మొక్కలు నాటాడు. నేడు వాటిల్లో 384 మొక్కలు ఏపుగా పెరిగాయి. మరో 7 సంవత్సరాల్లో మార్కెట్ రేటు ప్రకారం ఈ చెట్లు టన్నుకు రూ.10 లక్షలకు పైగా ధర పలికే అవకాశం ఉంది.
ఎర్రచందనం, శ్రీగంధం సాగుచేయాలి..
కాసులు కురిపించే ఎర్రచందనం, శ్రీగంధం మొక్కల పెంపకం వైపు రైతులు దృష్టిసారించాలి. చాలామందికి ఇలాంటి పంటలపై అవగాహన లేదు. అటవీ శాఖ అధికారులను సంప్రదిస్తే అన్ని వివరాలు తెలియజేస్తారు. ఈ పంట కోతకు వచ్చినప్పుడు సంబంధిత ఫారెస్ట్ ఆఫీస్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. అటవీ అధికారులు వచ్చి చెట్లను తనిఖీ చేస్తారు. నాణ్యత నోట్ చేసుకొని రవాణాకు అంగీకరిస్తారు.
-సాయిరాం, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కొమురవెల్లి
రెండేండ్లు కష్టపడాలి..
మావద్ద రైతులు ఎక్కువగా వరి పంటను సాగుచేస్తారు. వరికి డిమాండ్ పెద్దగా లేకపోవడం ప్రభుత్వం ఇతర పంటలపై దృష్టిసారించాలని సూచిస్తున్నది. దీంతో నాకు ఎర్రచంద నం మొక్కలు పెంచాలనే ఆలోచన వచ్చింది. విజయవాడ నుంచి 650 ఎర్రచందనం మొక్కలను తెప్పించి సాగుచేశా. మొదట 2 సంవత్సరాల పాటు చెట్టు మొదళ్లలో గడ్డి లేకుండా చూడడంతో పాటు క్రిమికీటకాలు రాకుండా చూసుకోవాలి. మరో రెండేండ్లు కష్టపడితే చెట్లు ఏపుగా పెరుగుతాయి. మొదట్లో రూ.4లక్షలు ఖర్చు చేశా. ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేదు. ఏమున్నా శారీరక శ్రమ, ఎరువులు వేసుకుంటే సరి. ఎర్రచందనం మొక్కల పెంపకానికి శ్రమ తక్కువగా ఉండడంతో పాటు ప్రభుత్వం నుంచి రైతుబంధు సైతం వస్తున్నది.
-లక్ష్మీనారాయణ, రైతు, కొమురవెల్లి, సిద్దిపేట జిల్లా
వ్యవసాయంలో నిత్యపోరాటం చేస్తున్న రైతుకు ఆర్థికంగా స్థిరబడే అవకాశాలు నానాటికి తగ్గిపోతున్నాయి. ఏండ్ల తరబడి పంటలు సాగు చేయడమే తప్ప వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఉన్నత స్థితికి ఎదిగే మార్గం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కలపజాతి వృక్షాలైన ఎర్రచందనం రైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తూ భవిష్యనిధిని ఏర్పాటు చేస్తున్నది. ప్రపంచ మార్కెట్లో ఎర్రచందనానికి విపరీతమైన గిరాకీ ఉండడంతో ఇప్పుడిప్పుడే వీటి పెంపకానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.