పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో పడింది. వ్యవసాయం పండుగలా సాగుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లాలో రైతు బంధు వారోత్సవాలను అన్నదాతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా రైతులతో కలిసి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వివిధ రూపాల్లో సంబురాలు చేశారు. ఇండ్ల ముంగిళ్లల్లో రంగురంగుల ముగ్గులు వేసి మహిళలు.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి పొలాల్లో రైతులు వేడుకలు జరుపుకొన్నారు. డప్పు చప్పుళ్ల నడుమ ఎడ్లబండ్లతో ర్యాలీలు, ఊరేగింపులతో పల్లెపల్లెనా రైతు బంధు ముఖచిత్రం ఆవిష్కృతమవుతున్నది. ఆత్మకూరు(ఎం) మండలంలో జరిగిన సంబురాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, బీబీనగర్ మండలంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతుల కష్టాలు.. సీఎం కేసీఆర్ పాలనలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్లు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులకు వివరిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నివర్గాల ప్రజానీకం సంబురాల్లో పాల్గొంటున్నది. తొలుత ఈ నెల 10 వరకే రైతు బంధు సంబురాలు నిర్వహించాలని నిర్ణయించగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంక్రాంతి వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు వేడుకలను పతాకస్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
రైతును రాజుగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
బీబీనగర్, జనవరి 9 : రైతును రాజుగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రాచమళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వెంకిర్యాల గ్రామం నుంచి పల్లెగూడెం, రుద్రవెల్లి, రాఘవాపురం, చిన్నరావులపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల మీదుగా సుమారు 17కిలోమీటర్లు ప్రయాణించారు. మండల కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తాకు చేరుకుని మాట్లాడుతూ పంట పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి పది వేల రూపాయలు ప్రభుత్వం జమచేస్తున్నదన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది విడుతల్లో రూ.50వేల కోట్లు జమచేసిందని తెలిపారు. రైతు బీమా, 24 గంటల ఉచిత కరంట్ పథకాలు అమలు చేస్తూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నదని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఎంపీపీ ఎర్కల సుధాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి పింగళ్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, సర్పంచులు మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, అరిగె సుదర్శన్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంచాల రవి కుమార్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోరుకంటి బాలచందర్, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, నాయకులు కొలను దేవేందర్‌రెడ్డి, కొంతం లింగయ్య గౌడ్, ఆకుల ప్రభాకర్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి, జనవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబంధు వారోత్సవాలు ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. అభిమానం ఉప్పొంగడంతో సంబురాలు రోజురోజుకూ హోరెత్తుతున్నాయి. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకుతూ అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్పంచుకుంటున్నారు. ఆదివారం జిల్లాలో ఊరేగింపులు, క్షీరాభిషేకం కార్యక్రమాలు కొనసాగాయి. ఆత్మకూరు(ఎం) మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన రైతు బంధు వారోత్సవాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బీబీనగర్ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో నిర్వహించిన సంబురాల్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే పైళ్ల స్వయంగా ట్రాక్టర్ నడిపి శ్రేణులను ఉత్సాహపర్చారు. మోటకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పలు మండలాల్లో రైతు వేదికల వద్ద మహిళలు చూడముచ్చటగా ముగ్గులు వేశారు. పంట ఉత్పత్తులతో ‘జై రైతు బంధు, జైజై కేసీఆర్’ అని అక్షరమాలను పేర్చి టీఆర్ఎస్ సర్కార్‌పై ప్రేమను చాటుకున్నారు.
సంక్రాంతి వరకు సంబురాలు…
రైతు బంధు సంబురాలు సంక్రాంతి పండుగ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తొలుత 10 వరకు నిర్ణయించగా.. అప్పటి వరకు కొవిడ్ ఆంక్షలే ఉండడంతో మంత్రులు, నేతల విజ్ఞప్తి మేరకు ఉత్సవాలను సంక్రాంతి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రానున్నరోజుల్లో సంబురాలను పతాక స్థాయికి తీసుకెళ్లేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నదాతకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
ఆత్మకూర్(ఎం), జనవరి 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటూ అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. రైతు బంధు వారోత్సవాల సందర్భంగా ఆదివారం మండలంలోని పోతిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి అభినందించారు. అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం ఇప్పటి వరకు 8 విడుతలుగా రైతు బంధును అందజేసిందని, రైతు బంధు రూ.50వేల కోట్ల మైలురాయిని దాటడం చారిత్రాత్మకం అని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ఓర్వలేని ప్రతి పక్ష పార్టీలు అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు బిక్కేరు వాగులోని కాజ్వే ఎత్తును పెంచడంతో పాటు రహీంఖాన్‌పేట వద్దకు రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, సర్పంచ్ గనగాని మాధవి, ఏఓ శిల్ప, ఏఈఓ .సంపూర్ణ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు యాస ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్ కోరె భిక్షపతి, ఉప సర్పంచ్ శోభ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దశరథగౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్‌గౌడ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లారెడ్డి, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు అరుణ, మాజీ సర్పంచ్ వెంకటయ్య, టీఆర్ఎస్ మండల నాయకులు గనగాని మల్లేశం పాల్గొన్నారు.