సిద్దిపేట టౌన్, డిసెంబర్ 3 : లోక కల్యాణార్థం స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి లోకార్పణ కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలలో శ్రీ రామనగరం శంషాబాద్‌లో వైభవంగా నిర్వహించనున్నామని శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్వామిజీ సిద్దిపేట వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు స్వామిజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. వికాస తరంగిణి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శంషాబాద్‌లోని చినజీయర్ ఆశ్రమంలో స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రపంచంలోనే గొప్ప ఎత్తైన దైవ దిక్సూచిగా సమతామూర్తి భగవాన్ రామానుజల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరుగుతోందని తెలిపారు. ఈ దైవ మహోత్సవంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారన్నారు. లోక కల్యాణార్థం చేసే మహత్కార్యంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.