
ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి రైస్‌మిల్లులకు శరాఘాతంగా మారుతున్నది. ఉప్పుడు బియ్యాన్ని సేకరించబోమంటూ కేంద్రం, ఎఫ్‌సీఐ ఆడుతున్న దోబూచులాట కారణంగా పారాబాయిల్డ్ రైస్‌మిల్లులు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వాన్ని కావాలని బదనాం చేసే దురుద్దేశంతోనే కేంద్రం ద్వంద్వ ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం తీరుతో రైతులే కాదు, రైస్మిల్లర్లూ రోడ్డున పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి 2020-21 యాసంగిలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల మరాడించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎఫ్‌సీఐ నుంచి ఇప్పటివరకూ ఉలుకూపలుకూ లేకపోవడంతో బియ్యం నిల్వలు రైస్‌మిల్లుల్లో భారీగా పేరుకుపోయాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలతో ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులంతా ఇప్పుడు కేంద్రం వైఖరితో భయాందోళనకు గురవుతున్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గడిచిన ఐదేండ్లలో నిజామాబాద్ జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో ధాన్యం దిగుబడి వచ్చింది. 2014-15 సంవత్సరం వానకాలంలో 47,448 మంది రైతుల నుంచి 2,42,278 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. వీటి మొత్తం విలువ రూ.339.14 కోట్లు మాత్రమే. కానీ ప్రస్తుతం ధాన్యం ఉత్పాదకత భారీగా పెరిగింది. 2020-21 యాసంగిలో 98,262 మంది రైతుల నుంచి 7,43,531 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి మొత్తం విలువ రూ.1398.58 కోట్లు. ప్రస్తుతం వానకాలంలో నిజామాబాద్ జిల్లాలో 87,067 మంది రైతుల నుంచి రూ. 1237 కోట్లు విలువ చేసే 6,31,494 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. ఇంకా ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన సాగు సౌకర్యాలతో వరి విస్తీర్ణం, ధాన్యం దిగుబడి క్రమంగా పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో నిజామాబాద్ జిల్లాలో 150 రైస్ మిల్లులున్నాయి. 11 గోదాములు నెలకొనగా వీటి సామర్థ్యం 3లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. స్వరాష్ట్రం సిద్ధించడానికి పూర్వం గోదాముల సామర్థ్యం అప్పటి దిగుబడికి సరిపోయేది. ఇప్పుడు భారీగా ధాన్యం దిగుబడి వస్తుండడంతో గోదాములన్నీ నిండిపోతున్నాయి. రైతుల నుంచి సేకరించిన ధాన్యం బస్తాలను కుప్పులు కుప్పులుగా మిల్లుల్లో, ఫంక్షన్ హాళ్లలో సర్దుబాటు చేయాల్సి వస్తున్నది.
నష్టాల ఊబిలోకి రైస్‌మిల్లులు
కేంద్రం విధిస్తున్న కొర్రీల కారణంగా.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారంతా భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన ఐదారేండ్లలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొత్తగా సుమారు 120 రైస్‌మిల్లులు ఏర్పాటయ్యాయి. వీటిలో అత్యధికం పారాబాయిల్డ్ రైస్‌మిల్లులే. రా రైస్‌మిల్లులు కొన్నిమాత్రమే నెలకొల్పారు. వ్యవసాయక ప్రాంతమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి ఉత్పత్తులు గణనీయంగా పెరగడంతో కొరతను అధిగమించడంలో భాగంగా వ్యాపారులు చాలామంది రైస్‌మిల్లులను ఏర్పాటు చేశారు. రూ.3కోట్ల నుంచి రూ.4కోట్లు వెచ్చించి స్థాపించిన మిల్లులు సమీప భవిష్యత్తులో వెలవెలబోయే ప్రమాదం పొంచి ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లోనే దాదాపుగా రూ.50కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బాయిల్డ్ రైస్ తీసుకోబోమంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెగేసి చెబుతుండడంతో.. వాటిపై ఆధారపడి యూనిట్లు స్థాపించిన వారంతా ఆందోళనకు గురవుతున్నారు. రూ.కోట్లు పెట్టి స్థాపించిన మిల్లుల గతేం కావాలంటూ మిల్లర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైస్‌మిల్లులు నడవకపోతే భవిష్యత్తులో రుణాలు చెల్లించలేక అప్పులు పెరిగి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని వారు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా భారత ఆహారసంస్థ వ్యవహరిస్తున్న జాప్యంతో మర ఆడించిన బియ్యం తీసుకోకపోవడంతోనూ కుప్పలు కుప్పులుగా నిల్వలు పేరుకుపోతున్నాయి. తద్వారా నిర్వహణా వ్యయం భారీగా పెరిగి లాభాలు హరించుకుపోతున్నట్లుగా రైస్‌మిల్లర్లు చెబుతున్నారు.
బారులు తీరుతున్న లారీలు
గత మూడు సీజన్ల నుంచీ కేంద్రప్రభుత్వం ధాన్యం విషయంలో కొర్రీలు పెడుతూ వస్తున్నది. ఉప్పుడు బియ్యం సేకరణలో ఆటంకాలు సృష్టించడం ద్వారా క్షేత్రస్థాయిలో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. నిజామాబాద్ జిల్లా నుంచి 2020-21 యాసంగిలో 6లక్షల మెట్రిక్ టన్నుల మర ఆడించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎఫ్‌సీఐ నుంచి ఉలుకూపలుకేదీ లేకపోవడంతో మర ఆడించిన బియ్యం నిల్వలు రైస్‌మిల్లుల్లో పేరుకుపోయాయి. యాసంగిలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పేరిట సేకరించిన ధాన్యాన్ని మర ఆడించే పని ఇంకా కొనసాగుతున్నది. 2లక్షల మెట్రిక్ టన్నుల మేర నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది. అంతలోపే వానకాలం పంట ఉత్పత్తులు రావడంతో మిల్లర్లు తలలు పట్టుకుంటున్నారు. 2021-22 వానకాలంలో సేకరించిన 6.31లక్షల మెట్రిక్ టన్నుల్లో రూ.856 కోట్లు విలువ చేసే 4.36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్‌మిల్లర్లకు ప్రభుత్వం చేరవేసింది. మిల్లులకు భారీగా వచ్చి చేరుతున్న ధాన్యం బస్తాలను నిల్వ చేయడానికి స్థలం లేక ఆగమాగం అవుతున్నారు. దీనంతటికీ కేంద్రప్రభుత్వ విధానాలే కారణమని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. బియ్యం సేకరణలో జాప్యం కారణంగా భారత ఆహార సంస్థ తమనుంచి మర ఆడించిన బియ్యాన్ని తీసుకో వడం లేదంటూ వారు వాపోతున్నారు. బియ్యం నిల్వలు నిండిపోయి ఉన్నాయంటూ ఎఫ్‌సీఐ చేతులెత్తేస్తుండడంతో.. తమ వద్దకు వచ్చి చేరుతున్న వానకాలం ధాన్యాన్ని ఏమీచేయలేక కుప్పలుగా పోయాల్సి వస్తున్నదని రైస్‌మిల్లర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బస్తాలతో బతుకు పోరాటం
కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట ఇచ్చే ధాన్యాన్ని వద్దనలేక… వచ్చిన ధాన్యాన్ని దాచుకోలేక మిల్లర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సీఎంఆర్ వద్దంటే మిల్లు లు మూసుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. బస్తా లు దించుకుందామంటే నిల్వ చేసుకునేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఏడాదిన్నర కాలంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ రైస్‌మిల్లర్లు ఆగమాగం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకే అవకాశం ఉంది. 2014 నుంచి 2019 వరకు ఈ గోదాములను రొటేషన్ పద్ధతుల్లో వాడుకోవడం ద్వారా ఇబ్బందులు తలెత్తలేదు. పంట ఉత్పత్తులు భారీగా వచ్చినప్పటికీ.. సర్దుబాటు చేసుకుంటూ సమన్వయం చేసుకున్నారు. మర ఆడించిన బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేయడం ద్వారా మిల్లుల్లోనే బస్తాలు ఉంటున్నాయి. ఫలితంగా వానకాలం ధాన్యాన్ని మర ఆడించేందుకు తగు సమయం లేక… ఇన్‌టైమ్‌లో ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేయలేక మిల్లర్లు ఒత్తిడికి గురవుతున్నారు. భారత ఆహార సంస్థ కావాలని బియ్యం సేకరణను ఆలస్యం చేయడం ద్వా రా.. గడువు పేరుతో సేకరించాల్సిన ధాన్యాన్ని తిరిగి వెనక్కి పంపేందుకే కేంద్రం ఈ రకమైన కుట్రలు చేస్తున్నదని రైస్‌మిల్లర్లు విమర్శిస్తున్నారు.
వడ్ల విషయంలో కుట్రలు చేస్తుండ్రు..
వడ్ల కొనుగోలు విషయంలో కావాలనే బీజేపోళ్లు కుట్రలు చేస్తుండ్రు. ఎప్పుడూ లేంది ఇప్పుడే సమస్యలు వచ్చుడేంది. ఒకవేళ పంట ఉత్పత్తుల సేకరణలో సమస్యలుంటే కేంద్రమే చూసుకోవాలి. రాష్ర్టాలతో సమన్వయం చేసుకునే బాధ్యత కేంద్రానిదే కదా. తెలంగాణ ప్రభుత్వాన్ని రైతుల్లో బద్నాం చేయాలనే కక్షపూరితంగా చేస్తున్న కుట్ర ఇది.
ఆలస్యం చేసి ఆగం చేయాలనే కుట్ర..
ఏండ్ల సంది పండించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన తర్వాత కేంద్రం కొంటుంది. మోడీకి చేతకాక రాజకీయం చేస్తుండు. రైతులకు మేలు చేయలేక తెలంగాణలో కిరికిరి పెట్టాలని చూస్తుండు. బియ్యం కొనడంలో ఆలస్యం చేస్తే పరిస్థితులు ఆగం కావాలని కేంద్రం ఆలోచనగా ఉంది. రైతుల పొట్ట కొట్టిన వాడెవ్వడూ బాగుపడలేదు.