యాదాద్రి, జనవరి 3 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకంతో అర్చించిన అర్చక బృందం సుదర్శన నారసింహ హోమ పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్ర రీతిలో జరిపించారు. బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవారికి వెండిజోడు సేవను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక వ్రతం ఆచరించారు. పూర్వగిరి(పాతగుట్ట) నరసింహ స్వామి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాంటకంగా కొనసాగాయి. యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర ఆలయంలో పురోహితులు పరమశివుడికి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్‌లో వెలసిన బాలశివాలయంలో ప్రభాతవేళలో మొదటగా గంటన్నర పాటు శివున్ని కొలుస్తూ జరిపిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివున్ని విభూతితో అలంకరించారు. శివాలయ ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలను పటిస్తూ తిరుప్పావై పూజలు ఘనంగా నిర్వహించారు. గోదాదేవి రచించిన పాశురాలను పఠిస్తూ భక్తులకు వినిపించారు. శ్రీవారి ఖజానాకు రూ. 14,50,184 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,61,950
రూ. 100 దర్శనం టిక్కెట్ 14,500
వీఐపీ దర్శనాలు 2,23,950
వేద ఆశీర్వచనం 12,000
నిత్యకైంకర్యాలు 600
ప్రచారశా 14,000
క్యారీబ్యాగుల విక్రయం 10,000
వ్రత పూజలు 38,400
కళ్యాణకట్ట టిక్కెట్లు 13,000
ప్రసాద విక్రయం 5,97,240
వాహనపూజలు 14,200
టోల్గేట్ 1,400
అన్నదాన విరాళం 6,282
సువర్ణ పుష్పార్చన 1,41,000
యాదరుషి నిలయం 12,000
పాతగుట్ట నుంచి 17,070
ఇతర విభాగాలు 1,55,292