అతడికి చిన్పప్పటి నుంచి రంగుల ప్రపంచంపై ఆసక్తి ఎక్కువ. మొదటగా స్నేహితుడి సహకారంతో షార్ట్‌ఫిల్మ్ తీశాడు. అది సక్సెస్ కావడంతో పట్టువదలని విక్రమార్కుడిలా సినిమారంగం వైపు అడుగులు వేశాడు. అల్లరి నరేశ్ హీరోగా నటించిన నాంది సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకోవాలన్నదే లక్ష్యమంటున్న సంగారెడ్డికి చెందిన కె.ఉదయ్ చరణ్ పై ప్రత్యేక కథనం.
కంది, డిసెంబర్ 18: సంగారెడ్డిలోని మంజీరానగర్‌లో నివాసం ఉంటున్న కుమ్మరి విఠల్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. విఠల్ స్థానికంగా వ్యాపారం చేస్తుండగా.. విజయలక్ష్మి గృహిణి. వీరి స్వగ్రామం పుల్కల్ మండలం కాగా, 27 ఏండ్ల క్రితమే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమారుడు ప్రస్తుతం సివిల్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. చిన్నకుమారుడు ఉదయ్చరణ్ సంగారెడ్డి మండలంలోని ఫసల్వాదిలోని ఎంఎన్‌ఆర్‌లో పదోతరగతి పూర్తిచేశాడు. ఆతర్వాత ఇస్నాపూర్‌లోని ఆర్ఆర్ఎస్ కళాశాలలో డిప్ల్లొమా పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి అతడికి సినిమారంగం అంటే ఆసక్తి ఉండేది. అతడి కోరికను తల్లిదండ్రులు కాదనలేదు. 2014లో మొదటిసారి తన స్నేహితుడు సహకారంతో ఓ చిన్న కెమెరాతో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలోనే ‘నిత్యా ది సిస్టర్స్ పేరు’తో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను వివరిస్తూ అందరికీ అవగాహన కల్పించేలా షార్ట్‌ఫిల్మ్ తీశాడు. అదే అతడి మొదటి డైరెక్షన్. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి అవకాశాల కోసం వేట ప్రారంభించాడు.
డైరెక్షన్ కోర్సు పూర్తిచేసి…
హైదరాబాద్ గచ్చిబౌలిలోని (2018లో) దాదా సాహెబ్ పాల్కే యాక్టింగ్ అకాడమీలో ఉదయ్చరణ్ డైరెక్షన్ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత కొన్ని పేరుపొందిన సంస్థల వద్దకు అసిస్టెంట్ డైరెక్షన్ కోసం వెళ్లినా అతడికి అవకాశాలు రాలేదు. దీంతో ఇంటికి తిరిగి వచ్చాడు. మనసులో మాత్రం డైరెక్టర్ కావాలన్న ఆశను వదులుకోలేదు. 2019లో నలుగురు స్నేహితులతో కలిసి ‘గణేశ్ గ్యాంగ్స్’ పేరుతో మరో షార్ట్‌ఫిల్మ్ తీశాడు. ఇది మొత్తం గణేశ్ ఉత్సవాలకు సంబంధించి ఫుల్లెంత్ కామెడీ షార్ట్మూవీ. దీనిని తన సొంత య్యూటూబ్ చానల్ ‘రీల్షో’లో అప్లోడ్ చేశాడు. దీనికి బాగానే వ్యూస్ వచ్చాయి.
‘నాంది’ సినిమాలో తొలి అవకాశం..
2019 విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేశ్ హీరోగా నటించిన నాంది చిత్రంలో తన స్నేహితుడైన ఆదిల్ ఆ సినిమాకి అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేశాడు. అతడి సహకారంతోనే ఉదయ్చరణ్కు కూడా ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తొలి అవకాశం వచ్చింది. ఆ తర్వాత లాక్డౌన్లో ఇంటిదగ్గర ఉన్న అతడు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వికారాబాద్‌కు చెందిన ప్రవీణ్ సహకారంతో రూ.20వేలు ఖర్చు చేసి తానే సొంతంగా నటించిన ‘ఐ కెన్ సీ యూ’ అనే షార్ట్‌ఫిల్మ్ తీసి, 2021 మార్చి 13న తన యూట్యూబ్ చానల్ రీల్షోలో అప్లోడ్ చేశాడు. ఈ షార్ట్‌ఫిల్మ్ కథేమిటంటే సైకోగా మారిన వ్యక్తికి ఒంటరిగా ఉంటే ఎలాంటి భయాలు, లేనిపోని అనుమానాలు వస్తాయనేదే దాని ఇతివృత్తం. ఇదిబాగా తీయడంతో దీనికి వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
సొంతంగా సినిమా తీయాలనేదే అంతిమ లక్ష్యం..
టాలెంట్‌ను నిరూపించుకోవాలని డైరెక్టర్ల దగ్గరకు వెళ్లినా అవకాశాలు లభించకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తూ సొంత య్యూటూబ్ చానల్లో అప్లోడ్ చేస్తున్నా. ‘ఐ కెన్ సీ యూ’ ‘గణేశ్ గ్యాంగ్స్’ మంచిపేరు తీసుకొచ్చాయి. నాంది సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. వికారాబాద్‌కు చెందిన స్నేహితుడు ప్రవీణ్‌తో కలిసి సొంతంగా సినిమా తీయాలనేదే అంతిమ లక్ష్యం. మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకోవాలి. తల్లిదండ్రులు, స్నేహితులు సహకరిస్తున్నారు.