నారాయణపేట టౌన్, డిసెంబర్ 24 : వినియోగదారుడు తన హక్కులతోపాటు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని, అప్పుడే సమాజంలో జరుగుతున్న అన్యాయం, కల్తీ నుంచి రక్షణ పొందవచ్చని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కల్తీ, అన్యాయాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తి కల్తీకి, అన్యాయానికి అలవాటు పడిపోయాడని పేర్కొన్నారు. ఈ ఏడాది వినియోగదారుల దినోత్సవంలో ప్లాస్టిక్‌పై దాడి అనే నినాదాన్ని ఎంచుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధితో అనేక మంది బాధపడేందుకు కారణం కల్తీయేనన్నారు. వినియోగదారుడు అన్యాయానికి గురైనప్పుడు పౌర సరఫరాల శాఖ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. వస్తువు కొనుగోలు చేసినప్పుడు రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని, నాణ్యత లేకున్నా, గరిష్ఠ ధర కన్నా ఎక్కువకు విక్రయించినా నిలదీయాలని, కేసులు నమోదు చేయించాలన్నారు. ప్రతి వ్యక్తి తనకున్న హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరూ మోసపోకుండా చూడాల్సిన బాధ్యత వినియోగదారుల ఫోరం సభ్యులపై ఉంటుందన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మోసాలు, వినియోగదారుల హక్కులను వివరించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మేనేజర్ హాతిరాం, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు బాలరాజు, బీసీ సంక్షేమశాఖ అధికారి కృష్ణమాచారి, ఫోరం మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.